skip to main |
skip to sidebar
మొన్న "లైలా" తుఫాను మద్రాసులో కూడా ఒక రోజు నాట్యమాడింది. ఆ సంధర్భంలో నిజంగా జరిగిన ఒక సంఘటణను నా మాటల్లో మీకు ఇలా.......
చినుకులే పడనవసరం లేదు...మబ్బేసినా చాలు స్కూలు మానేయాలన్న ఆలోచన రావడానికి!! పొద్దున్నే లేచేసరికే రాత్రి బాగా కురిసి మళ్ళీ మరో వాయ కురవడానికి సిద్ధంగా కారు మబ్బులతో ముస్తాబై ఉండేది ఆకాశం. అమ్మ చేసిన ఉప్మా వేడి వేడిగా తినేసి స్కూల్ డ్రెస్ వేసుకుని ఆత్రంగా గుమ్మం దగ్గర నుంచుని ఇంకా ఎక్కువ గాలి వేయాలి, ఇంకా ఎక్కువ వర్షం కురవాలి, చెట్లు పడిపోవాలి, రోడ్లు మునిగిపోవాలి.మొత్తం ఆకాశం చీకటిగా అయిపోవాలి అని ఆశగా వర్షం వంక చూసిన రోజులు ఈ మట్టి బుర్రకి ఇంకా గుర్తున్నాయి. అలా చూస్తుండగానే అప్పటికే స్కూల్ కి బయలుదేరిన వారు సైకిల్ మీద వెనక్కి వస్తుంటే స్కూల్ లేదు అన్న విషయం తెలిసినప్పుడు కలిగిన ఆనందం ఏంటో ప్రత్యక్షంగా చూసిన మా అమ్మనడగండి. హమ్మయ్య ఈ రోజుకి స్కూల్ లేదు అని గట్టిగా ఊపిరి పీల్చుకుని కృతజ్ఞతగా వర్షానికి థ్యాంక్స్ చెప్పేవాణ్ణి. " బట్తలు మార్చుకుని పుస్తకాలు తీసి హాల్ లో కూర్చుని చదువుకొ..ఆ కిటికీ తలుపులు మూసెయ్యి జల్లు కురుస్తుంది...!!" - వంట గదిలోంచి పప్పు చారుకి పోపు వేస్తూ మా అమ్మగారు చెప్పే సాధారణ వాక్యం. నా రగ్గు తీసి కప్పుకుని మంచానికి కొసన కిటికీ దగ్గర కూర్చుని బ్రూ కాఫీ (వర్షం పడినప్పుడు మా అమ్మని బతిమాలి మరీ కాఫీ తాగేవాణ్ణి!!) తాగుతూ అలా ఆలోచిస్తూ కూర్చుంటే...!! ఆ అనుభూతిని అనుభవించిన మనసుది ఎంత అదృష్టం!! .
ఓ పక్కన చినుకుల చిట పటలు మరో ప్రక్క వంటింట్లో వేగుతున్న ఒడియాల చిటపటలు. ఆ శబ్దం ఇంకా చెవుల్ని వదళ్ళేదు!! ఆ పప్పు చారు రుచీ ఇంకా నాలుకని వీడలేదు!!. భోజనాలు కాగానే కాస్త వర్షం హోరు తగ్గింది అని తెలియగానే బయటకి వచ్చి పేపర్ తో పడవలు చేసి మా అన్నయ్య, అక్క తో కలిసి అప్పటికే నీటితో నిండిన వాకిట్లో వదిలే వాళ్ళం. అవి అలా కాసేపు సాఫీగా ప్రయాణించి వెళ్ళి డ్రైనేజీ లో కలిసేవి. ఆ కాస్త " పడవ ప్రయాణానికే " ఒళ్ళు పులకరించిపోయేది. అదో అద్భుతం. అదో ఎచీవ్మెంట్..నేను చేసిన పడవ అంత ముద్దుగా ఆ వర్షం లో అలా తడుచుకుంటూ వెళ్తుంటే ఏదో సాదించానన్న గర్వం. ఈలోపు వర్షం లో తడుస్తున్నారా? వచ్చి పడుకోండి..ఆ తలుపులు దగ్గరకి వేసి గెడ పెట్టి రా బాబి..!! " అని మా అమ్మ పిలుపు కి అందరం అప్పటికే చాప వేసి దాని మీద బొంత పేర్చి ఉండేది అందరం తలా ఒక రగ్గు తెచ్చుకుని ఎవరి దుప్పట్లోకి వాళ్ళు దూరేసేవాళ్ళం. సాయంత్రం లేచి చూసేసరికి కారు చీకట్లతో వర్షం భీభత్సంగా కురిసేది. అమ్మా!! వేడి వేడిగా ఏదైనా చెయ్యొచ్చుగా? అంతే " అటుకులని బాగా నూనెలో వేయించి ఉప్పూ కారం జల్లి వేడి వేడి గా తినేవాళ్లం.
ఆ రాత్రికి మళ్ళీ మిగిలిన పప్పు చారులో ఆంలెట్ చేసుకుని నంజుకుని భోజనం ముగించేవాళ్ళం. ఆ రాత్రికి పడుకునే ముందు రేపు కూడా ఇలా వర్షం తగ్గకుండా ఉంటే బాగుండు!! అని ఓ చిన్న ఆశతో పడుకున్నాం. ప్రొద్దున్నే లేచేసరికి వర్షం తెరిపిచ్చి సూర్యుడు అప్పుడే సిగ్గుపడుతూ వచ్చాడు. కాలనీ పెద్దలంతా విరిగిపోయిన చెట్లను నరకడం లోనూ, కరెంట్ తీగలు ఎక్కడెక్కడ తెగిపోయాయో చూసి కరెంట్ ఆఫీసు కి ఫోన్ చేసే పనిలో నిమగ్నం అయ్యేవారు. అక్కడ అలా జరిగిందట, ఇక్కడ ఇలా జరిగిందట అని ఆడవాళ్లంతా వాకిట్లో రాలిపోయిన ఆకుల్ని కాయల్ని ఊడుస్తూ చెప్పుకునేవారు.
****************************************************************
వర్షం పడుతూనే ఉంది. తడిసిన బట్తలు ఇంకా ఆరలేదు. ఆఫీస్ లో నా క్యాబిన్ లో కూర్చుని కిటికీ వైపు చూస్తూ ఉన్నా .. ఇంతలో మా అసిస్టెంట్ వచ్చి - "సార్ ఉంగళకు కాఫీ..సూడా సాపాడు సార్" (సార్ మీకు కాఫీ..వేడిగా తాగండి సార్) - అలాగే ఆ పక్కన పెట్టు.
ఆ రేవు (కాకినాడ) నుంచి ఈ రేవుకి (మద్రాసు) ఏ నావలో మోసుకొచ్చిందో మా ఇంటి మట్టి వాసన్ని ఈ మాయదారి గాలి !!!