జ్ఞాపకాల పల్లకి

స్వాగతం

అందరకీ నమస్కారం...రండి కూర్చోండి ఇలా ఈ చెట్టు కింద కాసేపు సేద తీరుదాం...మన జ్ఞాపకాలని, బాల్యపు మధురస్మృతులని కొంతసేపు పంచుకుని వెళదాం...నా విషయానికి వస్తే ... నా జీవితాన్ని ప్రాభావితం చేసిన వారెందరో..నేను వేసే ప్రతీ అడుగులోనూ వారి జాడ కనపడుతొంది...నా ప్రతీ మాట వెనుక, కవిత వెనుక, రచన వెనుక వారి స్వరం వినిపిస్తొంది .."నేను" అని ఉన్న ప్రతీ చోట వారుంటారు ... ఇక్కడ చూస్తున్న తోటకి తోటమాలిని నేనే అయినా వీటిని నాటింది మాత్రం ఒక స్నేహితుడు (భరత్ కుమార్)...ముందే చెప్పాను గా నేనున్న ప్రతీ చోటా మరొకరి జాడ మీకు కనిపిస్తుంది....కావున మరొక్కసారి వారందరనీ తలుచుకుంటూ ..మీ అందరకీ ఆహ్వానం.

నాకన్నీ జ్ఞాపకమే


నాకన్నీ జ్ఞాపకమే
అరుగు మీద అక్కతో కలిసి బుడుకులుతో ఆడుకోవడం
చీపురు పుల్లలతో బాణాలను చేసుకుని కానుగ చెట్ల ఆకులకు గురి చూసి కొట్టడం
ఇసుక గూళ్ళను కట్టడం...పెంకిటుల్లుకున్న దూలాలకు వేలాడడం

నాకన్నీ జ్ఞాపకమే

అమ్మ ఇచ్చిన అర్ధరూపాయి పడేసుకున్నప్పుడు కలిగిన భయం
నన్ను కొట్టాడని చెప్పి నాన్న చేత అన్నయ్యను కొట్టించినప్పుడు కలిగిన ఆనందం
సైకిలు నేర్చుకుంటూ కింద పడి మోకాళ్ళకు కలిగిన గాయం

నాకన్నీ జ్ఞాపకమే

ఉడకపెట్టుకుని తిన్న చిలకడ దుంపలు, వేయించుకుతిన్న వేరుసెనగ గుళ్ళు...
ఎండపెట్టుకుని తిన్న రేగు ఒడియాలు...ఊరపెట్టుకుతిన్న రావి ఉసిరికాయలు..
కొనుక్కుని తిన్న తవుడు బిస్కెట్లు....కాల్చుకు తిన్న పనస పిక్కలు, పొత్తులు, తేగలు

నాకన్నీ జ్ఞాపకమే

ఆడుకున్న ఏడు పెంకులాట...నేలాబండా ఆట,
దొంగా పోలీసు, అష్టా చెమ్మా..
రాముడూ సీతా, అమ్మా నాన్న ఆట
నాకన్నీ జ్ఞాపకమే

ఏరుకున్న గురివింద గింజలు...చెప్పులకు గుచ్చుకున్న పల్లేరు కాయ ముళ్ళులు..
జేబుకు మరకలైన ఇంకు పెన్ను...పెన్సిలు చెక్కుకుంటూ చేతికి గాయం చేసిన బ్లేడు,
అక్కిచ్చిన చెక్క స్కేలు...అన్నయ్య వాడేసి ఇచ్చిన కంపాస్ బాక్సు

నాకన్నీ జ్ఞాపకమే

గాల్లోకి ఊదిన నీటి బుడగలు...తెగిపొయిన గాలిపటాలు
వలవేసి పట్టిన చిన్న చేపలు...వాన నీటిలో వేసిన కాగితం పడవలు
కొబ్బరి ఆకులతో అల్లుకున్న బొమ్మలు...తాటాకులతో చేసుకున్న విసిన కర్ర

నాకన్నీ జ్ఞాపకమే

వినాయక చవితికి కట్టుకున్న పాలవెల్లి, చూసిన వీధి సినిమా....శ్రీ రామ నవమికి తాగిన పానకం
నవరాత్రుల్లో నవమి రోజున గుల్లో భొజనాలు...సంక్రాంతి కాలంలో హరిదాసు చేసిన చేతి తాళాల చప్పుల్లు కాలి గజ్జెల సవళ్ళు

నాకన్నీ జ్ఞాపకమే

చెప్పిన అబద్దాలు....దాచిన నిజాలు, కలిగిన అనుభవాలు..చెరిగిన కలలు...చెదిరిన ఆశలు
అన్నీ జ్ఞాపకమే నాకన్నీ జ్ఞాపకమే

0 comments:

Post a Comment