జ్ఞాపకాల పల్లకి

స్వాగతం

అందరకీ నమస్కారం...రండి కూర్చోండి ఇలా ఈ చెట్టు కింద కాసేపు సేద తీరుదాం...మన జ్ఞాపకాలని, బాల్యపు మధురస్మృతులని కొంతసేపు పంచుకుని వెళదాం...నా విషయానికి వస్తే ... నా జీవితాన్ని ప్రాభావితం చేసిన వారెందరో..నేను వేసే ప్రతీ అడుగులోనూ వారి జాడ కనపడుతొంది...నా ప్రతీ మాట వెనుక, కవిత వెనుక, రచన వెనుక వారి స్వరం వినిపిస్తొంది .."నేను" అని ఉన్న ప్రతీ చోట వారుంటారు ... ఇక్కడ చూస్తున్న తోటకి తోటమాలిని నేనే అయినా వీటిని నాటింది మాత్రం ఒక స్నేహితుడు (భరత్ కుమార్)...ముందే చెప్పాను గా నేనున్న ప్రతీ చోటా మరొకరి జాడ మీకు కనిపిస్తుంది....కావున మరొక్కసారి వారందరనీ తలుచుకుంటూ ..మీ అందరకీ ఆహ్వానం.

రాయలేని భాష ఇది


చెప్పలేని భావమిది....చూపలేని వేదనిది
రాయలేని భాష ఇది....రాతలన్ని చెరిపినది
మూగమది రోదనిది... నా ప్రాణమునే వీడినది
బంధాలన్నీ తెంచుకున్న పాశమిది

నా హృద్యానవనాన పూసినది... పూటైన పోకుండా వాడినది
ఆ ఆకాశదేశాన మెరిసినది...తారల్లే ఉండకుండా రాలినది
చినుకేలేని ఒక మేఘం నాలో జడివానై కురిసింది
తీగేలేని మదివీణే నాలో కోటి రాగాలేల పలికింది
నీరే లేని సెలయేరే నాలో ఉప్పెనలాగా పొంగిన వేళ .....

చెప్పలేని భావమిది....చూపలేని వేదనిది
రాయలేని భాష ఇది....రాతలన్ని చెరిపినది
మూగమది రోదనిది... నా ప్రాణమునే వీడినది
బంధాలన్నీ తెంచుకున్న పాశమిది

బతికే సాధించాలి!!!


రెండూ రాళ్ళే !

ఒకటి మూలవిరాట్టై గర్భగుళ్ళో పూజలందుకుంటుంది. రెండోది, గుడిముందు గడపై భక్తుల కాళ్ళకు అడ్డొస్తుంది.
ఎందుకీ తేడా? నిన్ను మొక్కడమెందుకు ? నన్ను తొక్కడమెందుకు? అడిగింది గడప

మిత్రమా ...గుర్తుందా? ఒకప్పుడు మనిద్దరం ఒకే కొండ మీద ఉండేవాళ్ళం. ఒక మహా శిల్పి మన కొండకొచ్చాడు. శిల్పంగా మలిచే ప్రయత్నంలో, ఉలితో ఒక దెబ్బ వేయగానే నొప్పి తట్టుకోలేక నువ్వు కుప్పకూలిపోయావు. నేను మాత్రం నిబ్బరంగా నిలబడ్డాను. దేవతామూర్తిగా రూపుదిద్దుకున్నాను. ఆ గాయాల్ని అనుభవించిన ఫలమే ఇది" ..వివరించింది విగ్రహం.

నిజమే!! "వైఫల్యమంటే పోరాటంలో ఓడిపోవడం కాదు.పోరాడే ప్రయత్నమే చేయకపోవడం"

మనం ఆహా ఓహో అని పొగుడుకుంటున్న సచిన్ 76 మ్యాచులు తర్వాత గానీ సెంచురీ చేయలేకపోయాడు..అతను కూడా నీలాగో నాలాగో డీలాపడుంటే. మళ్ళీ తన బ్యాట్ 100 సార్లు ఎత్తే అవకాశం వచ్చుండేది కాదు.

థామస్ అల్వా ఎడిసన్ - ఎలక్ట్రిక్ బల్బ్ కనిపెట్టడంలో 700 వందల సార్లు "విఫలమయ్యాడు". మొదటి ప్రయత్నంతోనే కష్టమని త్యజించేసి ఉంటే మీరు లైట్ వేసుకుని నా ఆర్టికల్ని చదవగలిగేవారా!!!! అతని మాటల్లోనే వినాలంటే "నేను 700 సార్లు విఫలమవ్వలేదు .. బల్బ్ వెలగకపోవటానికి 700 వందల కారణాలు కనుక్కోగలిగాను". ఇతమి విషయంలోనే మరో పర్యాయం అతని ల్యాబరేటరీ పూర్తిగా దగ్ధమైనప్పుడు కృంగిపోలేదు "హమ్మయ్య !! ఇప్పుడు మళ్ళీ తాజాగా నా ప్రయోగాలు మొదటి నుంచీ మొదలుపెట్టొచ్చు" అనుకున్నాడు. అతనికి మనలాంటి సామాన్యులకీ ఒకటే తేడా !! -------- "దృక్పధం" (యాటిట్యూడ్)

ఒక హెలన్ కెల్లర్ , ఒక లాన్స్ ఆరంస్ట్రాంగ్...ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలు మన చుట్టూ ఉంటాయి చెయ్యాల్సిందల్లా లేని పోని ఆత్మన్యూనతా భావపు ముసుగుల్ని తొలగించి క్షణికావాశంలో ఏదో (ఆత్మహత్య) చేసేసుకోవాలన్న భావన నుంచి బయటపడడమే!!

ఇలాంటి ఆలోచనకి ఎవరూ అతీతులు కారు అది నువ్వైనా నేనైనా!! నేనూ చాలా సార్లు ఇలా ఆలోచించినవాణ్ణే (మొన్నీమద్య కూడా) అందుకే నా మీద నాకే భయమేసి ఇలా రాసేస్తున్నా... ఉభయకుశలోపరి.. మీకు సలహా ఇచ్చినట్టౌతుంది ..నాకు కాస్త ఓదార్పు ఏడుస్తుంది.

ఇది వరకూ మనం న్యూస్ పేపర్లో ప్రేమలేఖలూ, ప్రచురనకర్తలకు లేఖలూ చూస్తుండేవాళ్ళం. అదేం దరిద్రమో ఈ మద్య అన్నీ "నా చావుకు ఎవరూ బాద్యత కాదు" అని కొసమెరుపుతో కూడుకున్న లేఖలే. ఒక బలహీన క్షణం, క్షణికావేశం "నిండు ప్రాణాలనే బలితీసేసుకుంటుంది".

"అమ్మా..!!
నేను చచ్చిపోతున్నాను. నాకు బతకాలని లేదమ్మా. ఏం చెయ్యమంటావు చెప్పు. ఎంత చదివినా గుర్తుండటం లేదు. మార్కులు తక్కువొస్తున్నాయి. నిన్న మా ప్రిన్సిపాల్ వార్నింగ్ ఇచ్చారు. ఈ సారి మంచి మార్కులు రాకపోతే ...నాన్న గారిని పిలిపించి మందలిస్తారట నా వళ్ళ నాన్నెందుకు మాటపడాలి? అందుకే చచ్చిపోవాలని నిర్ణయించుకున్నా. రేపు ఐ.ఐ.టీ ఎంట్రన్స్ రాసినా ర్యాంక్ రాదని తెలుసు. అప్పు చేసి కట్టిన లక్ష రూపాయిలూ బూడిదలో పోసినట్టే!! క్షమించమ్మా ...నాన్నకు నా మీద కోపం వచ్చినప్పుడల్లా "పోన్లెండి! పసివాడు, ఏదో తెలియక చేసాడు" అని సర్ది చెబుతుంటావు గా ..ఇప్పుడూ ఆయన్ని అలానే ఓదార్చమ్మా....ఉంటానమ్మా...."

ఇలాంటి లేఖలు లెక్కలేనన్ని ... రోజూ సూర్యుడితో పాటుగా అస్తమిస్తున్న పసి హృదయాలెన్నెన్నో!!!
చదువులోనో, ప్రేమలోనో విఫలమై మానసికంగా కృంగిపోయి ఇక జీవితమే లేదనుకుని తీసుకునే నిర్ణయం వెల ఒక జీవితం, తల్లి పడ్డ తొమ్మిది నెలల వేదన.

బతుకులు బిజీ అయిపోయిన ఈ కాంక్రీటారణ్యంలో మనసు అలసిపోతే సేద తీర్చేది మరో మనసే... అబ్బే అలా లేదు మనం మనమే సొంత నిర్ణయాలు తీసేసుకుంటాం. ప్రాణాలు తీసేసుకుంటాం. "చావటమంటే చచ్చేంత తేలిక!!"

ఒక పడక గదిలో ఉరితాడు బిగుసుకుంటుంది. ఒక వంటింట్లో కిరోసిన్ డబ్బా తెరుచుకుంటుంది, ఒక హాస్టల్ లో నిద్రమాత్రలు కూల్ డ్రింక్ లో కరిగిపోతున్నాయి. ఎవరో సడన్ బ్రేక్ వేసినట్టు, జీవిత చక్రం హటాత్తుగా ఆగిపోతుంది. ఇక కదలదు. వంద పేజీల పుస్తకం అసంపూర్ణంగా ముగిసిపోతుంది. కామా తర్వతా ఏమీ ఉండదు. ఒక చిన్నపాటి శబ్దం. ఒక్కో సారి అది కూడా ఉండదు. అయిపోతుంది ..అంతా అయిపోతుంది. అనుకున్న లక్ష్యాలు నెరవేరనేలేదు ..సాదించాల్సినవి సాధించలేదు. అనుభవించాల్సిన ఆనందాలు అనుభవించలేదు. అర్ధాంతరంగా అకస్మాత్తుగా జీవితం ముగిసిపోతుంది. అన్ని సమస్యలకూ డబ్బే కారణమనుకుంటాం . పేదరికాన్ని మించిన కష్టం లేదనుకుంటాం. వైకల్యాన్ని పెద్ద శాపంగా పరిగణిస్తుంటాం. కానీ ఆత్మహత్య చేసుకుంటున్న వారిలో నిరుపేదలు అతి తక్కువ. వాళ్ళ దృష్టిలో జీవితం ఒక పోరాటం. నోటి దగ్గరకు వెల్తున్న ప్రతీ ముద్దా ఒక విజయానికి ప్రతీక. వికలాంగులెప్పుడూ ఆత్మహత్యకు తెగబడరు. వాళ్ళు వేసే ప్రతీ అడుగూ వాళ్ళకు ఒక గమ్యమే ... అన్నీ ఉన్నా ఏదో లోపాన్ని ఊహించుకుని జీవితాన్ని దుర్భలంగా మార్చుకునేవారే ఆత్మహత్యలకు ప్రయత్నిస్తుంటారు. భార్య బిర్యానీ వండలేదనో, అందాల తార కరచాలనం చేయలేదనో, ప్ప్రియతమ నేత మరనించాడనో చెప్పి ప్రతీ ఐదు నిముషాలకొకటి రాలిపోతూనే ఉంది...వేసవి కాలంలో ఆకుల్లా ....చిన్న చిన్న సమస్యలకు చావులో పరిష్కారం వెతుక్కోవడం రోజు రోజుకూ పెరిగిపోతుంది. అలా అని ప్రతీ ఆత్మహత్య ఆలోచనా చావును కొనితెచ్చుకునే ప్రయత్నం కాదు. సాయం కోసం తుది వేడుకోలు. అవ్యక్తమైన పిలుపు, కన్నీళ్ళు రాలని ఏడుపు. అర్ధం చేసుకునే మనిషి కోసం , వెచ్చని ఓదార్పు కోసం ఎదురు చూస్తున్నామన్న బలమైన సంకేతం. ఆ సమయంలో వాళ్ళక్కావాల్సింది నేనున్నాననే భరోసా, బాధలు వినిపెట్టడానికొక సొంత మనిషి, ఆసరాగా ఓ భుజం. అంతే!!. వాళ్ళను మాట్లాడనివ్వండి మనసారా........ఏడవనివ్వండి వెక్కి వెక్కి తనివితీరా.....అడ్డు చెప్పే ప్రయత్నం వద్దు. ప్రెజర్ కుక్కర్లో వేడి వేడి ఆవిరి విడులైనట్టు వాళ్ళ ఆగ్రహం, బాధ, ఆవేశం, పస్చాతాపం అన్నీ కట్టలు తెంచుకుంటాయి. ఆ తర్వాత మనసు తేలికైపోతుంది.

సుతారంగా సీతాకోక చిలుక రెక్కలు పట్టుకుంటే చాలు ఎగిరిపోవాలని తపిస్తుంది. ప్రాణమంటే అంత తీపి. చిట్టి చీమ మీద చుక్క నీళ్ళు పొయ్యండి తల్లడిల్లిపోతుంది. బతుకంటే అంత ఆశ. మనిషికి మాత్రమే ఈ తొందరపాటు. చచ్చి సాధించాలన్న పిచ్చి. పిడికెడు నిద్రమాత్రలు చాలు. కష్టాలుండవు, కన్నీళ్ళుండవు, అప్పులు తీర్చాల్సిన పనుండదు, మార్కులు తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు..ఏదో శాస్వతమైన విముక్తి అని భావించేస్తాం. పోయింది ఒక ఉద్యోగం మాత్రమే.... మనం ప్రేమించిన వాళ్ళు కాకపోతే మనల్ని ప్రేమించేవాళ్ళు. చదువుకున్న చ్దువుంది, పుచ్చుకున్న పట్టా ఉంది, కన్న తల్లి దండ్రులున్నారు, స్నేహితుల ఆసరా ఉంది ...ఈ మాత్రం సాధనా సంపత్తి చాలు. పడినా లేవడానికి. "నన్ను ప్రేమించే మనుషుల కోసం వెతికితే ఒక్కరూ కనపడలేదు. నేను ప్రేమించడం మొదలు పెట్టగానే ఆ జాబితా రోజు రోజుకూ పెరిగిపోయింది..." ఈ మాత్రం ఆలోచించగల శక్తుంటే చాలు. చావలనుకుని నేను ఆలోచించి విఫలమైన ప్రతీ సారీ "చావలన్న ఆలోచనను గెలిచినందుకు" నాకు గర్వంగా అనిపిస్తుంటుంది. మనం ఓడిపోయామనుకోవడమెందుకు? ఆ విజయమే మనల్ని వరించడంలో విఫలమైందనుకుందాం. ఆ విజయం మీద జాలి చూపిద్దాం. విజయం, ఓటమీ రెండు వేరు వేరు కాదు. గొంగలిపురుగుకూ, సీతాకోక చిలుకకు ఉన్నంత తేడా ఉంది. ఈ రెండూ ఒకటే వాటి దశలే (స్టేజస్) తేడా ... వైఫల్యమంటే....విజయానికి ముందు దశ. అలా కాదనుకుని గొంగలిపురుగు మరో సీతాకోక చిలుకని చూసి బాధపడి ఆత్మహత్య చేసుకుంటే మరో తను సీతాకోకచిలుకగా మారగలదా. అందుకే చచ్చి మనమెం సాధించలేం. బతికి సాధించాలి....బతికే సాధించాలి!!!!.