జ్ఞాపకాల పల్లకి

స్వాగతం

అందరకీ నమస్కారం...రండి కూర్చోండి ఇలా ఈ చెట్టు కింద కాసేపు సేద తీరుదాం...మన జ్ఞాపకాలని, బాల్యపు మధురస్మృతులని కొంతసేపు పంచుకుని వెళదాం...నా విషయానికి వస్తే ... నా జీవితాన్ని ప్రాభావితం చేసిన వారెందరో..నేను వేసే ప్రతీ అడుగులోనూ వారి జాడ కనపడుతొంది...నా ప్రతీ మాట వెనుక, కవిత వెనుక, రచన వెనుక వారి స్వరం వినిపిస్తొంది .."నేను" అని ఉన్న ప్రతీ చోట వారుంటారు ... ఇక్కడ చూస్తున్న తోటకి తోటమాలిని నేనే అయినా వీటిని నాటింది మాత్రం ఒక స్నేహితుడు (భరత్ కుమార్)...ముందే చెప్పాను గా నేనున్న ప్రతీ చోటా మరొకరి జాడ మీకు కనిపిస్తుంది....కావున మరొక్కసారి వారందరనీ తలుచుకుంటూ ..మీ అందరకీ ఆహ్వానం.

ఎన్నో పాఠాలు నేర్పిన గురువు - చెన్నై మహానగరం.


చిన్నప్పుడు సినిమా రంగంలో విశిష్ట వ్యక్తుల జీవిత చరిత్రలు వారి అనుభవాలు ఎక్కువ చదివేవాణ్ణి. ఏ పుస్తకం తెరిచినా అది ఏ వ్యక్తిదైనా సరే మొదట ఇలానే మొదలయ్యేది "చదువుకు మద్యలోనే స్వస్తి పలికి సినిమాల మీద ఉన్న పిచ్చితో ఇంట్లొ చెప్పకుండా 5 రూపాయలతో మద్రాసు వెళ్ళే రైలెక్కేసాను..." ఇది చదువుతున్నప్పుడు అనిపించేది గొప్పవాళ్ళ తల్లిదండ్రులు ఇంత అసమర్దులా అని? :) అది చదివాకా నాకూ ఒక సారి మద్రాసు చూడాలనిపించేది..పెద్ద పెద్ద వాళ్ళందరూ అక్కడే ఉండేవాళ్ళట ఆ టీ. నగర్ , అడయార్ ఆ పేర్లు చదవగానే నాకూ ఓ సారి అక్కడకి వెళ్ళి ఆ వాహినీ స్టూడియోస్, జెమినీ స్టూదియోస్ చూడాలనిపించేది. ఆ అదంతా కల మనం ఎక్కడ వెళ్లగలం మద్రాసుకి!!. కాకినాడ దాటి విజాగు వెళ్తే చాలు మహాద్భాగ్యం అని అలా ఉన్న చోటనే ఓ నిట్టూర్పు విడిచేసి మళ్ళీ నా ఆటలేవో నేను ఆడేసుకునేవాణ్ణి.

ఔను మరి!! అప్పుడు నాకు తెలీదుగా నాకు ఉద్యోగం అక్కడే వస్తుందని. అప్పుడు పుస్తకాలలో చదివినట్టు టీ.నగర్, అడయార్ లలోనే ఉంటానని. అప్పుడు కన్న కలలకి ఓ పదేళ్ళు నిండి ఉంటాయి. ఇంతలో ఎంత మార్పు!! చెన్నై సెంట్రల్ లో అడుగు పెట్టగానే ఏదో తెలియని పులకింత...నేను అభిమానించే ఎందరినో తినే గా స్వాగతం పలికింది!!! నాకు ఇక్కడ స్నేహితులు కూడా ఉన్నారు కాబట్టి ఇక ఏ ఇబ్బంది లేదని ఎంతో ఉత్సాహంతో అడుగు పెట్టా. సంవత్సరం గడుస్తుంది. ఇప్పుడు నా సొంతూరికి (కాకినాడకి) బదిలీ అయ్యింది (చేయించుకున్నాను). ఈ ఒక్క సంవత్సర కాలం లో ఎంతో నేర్చుకున్నాను. ఎంతో మంది పరిచయమయ్యారు. ఎంతో మంది దూరమయ్యారు. ఎన్నో విషయాలు చాలా అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. కొన్ని నా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దాయి మరికొన్ని నా అస్తిత్వాన్ని ప్రశ్నించాయి. ఎన్నో అనుభూతులకు లోనయ్యాను. చల్లటి చెలిమినీ రుచి చూసా నిప్పుల కొలిమినీ అనుభవించాను. ఆఫీసులో అందరూ నన్ను బాగా చూసుకునేవాళ్ళు ..వాళ్ళు చూపించే ఆప్యాయతకు ఇక్కడే ఉండాలనిపించేది. నా వ్యక్తిగత జీవితంలో అనుకోని సంఘటనల వళ్ళ చాలా కుమిలిపోయా, నలిగిపోయా..ఎందరో స్నేహితూలను నా విషయాలలో కలగచేసుకోనివ్వలేదు..ఇప్పుడు వెంటనో ఎన్నో నిరాశలు, నిర్వేదనలు కలిగితే ఎవరితో చెప్పుకోను? ఎవరితో పంచుకుని దిగులు బరువును దించుకోను? అందుకే ఒంటరిగా ఇక్కడ చస్తూ బతకలేను అందుకే నేను పని చేస్తున్న మేనేజ్మెంట్ కి లిఖితపూర్వకంగా నా బదిలీ విషయాణ్ణి నాలుగు నెలల క్రితం పంపించా...ఇప్పటికి బదిలీ అయ్యింది. మనుషులతో ఎలా మసులుకోవాలు నేర్పింది (పూర్తిగా నేను అలవర్చుకున్నానో లేదో తెలీదు!!!). ప్రపంచం ఒక పద్మవ్యూహం అని ఎందుకంటారో ఇక్కడే తెలిసొచ్చింది. ఇక్కడికి రాక ముందు ఎన్నో లక్ష్యాలుండేవి నాకు అవన్నీ నీరశించిపోయాయి మళ్ళీ ఇప్పుడు కళ్ళ ముందు కదలాడుతున్నాయి. ప్రయత్నిస్తా. ఇప్పుడు సిగ్గుతో చెన్నై విడిచి వెళ్తున్నా మళ్ళీ ఇక్కడకొచ్చి పని చేసే అవకాశం దగ్గర్లో లేకపోలేదు!! అదే జరిగితే ఈ సారి ఠీవీగా వస్తా!!! ఎన్నో పాఠాలు అనుభవపూర్వకంగా నేర్పిన నా గురువు కి వందనాలు ..వెళ్ళొస్తా !!

" మాయదారి గాలి " !!


మొన్న "లైలా" తుఫాను మద్రాసులో కూడా ఒక రోజు నాట్యమాడింది. ఆ సంధర్భంలో నిజంగా జరిగిన ఒక సంఘటణను నా మాటల్లో మీకు ఇలా.......


చినుకులే పడనవసరం లేదు...మబ్బేసినా చాలు స్కూలు మానేయాలన్న ఆలోచన రావడానికి!! పొద్దున్నే లేచేసరికే రాత్రి బాగా కురిసి మళ్ళీ మరో వాయ కురవడానికి సిద్ధంగా కారు మబ్బులతో ముస్తాబై ఉండేది ఆకాశం. అమ్మ చేసిన ఉప్మా వేడి వేడిగా తినేసి స్కూల్ డ్రెస్ వేసుకుని ఆత్రంగా గుమ్మం దగ్గర నుంచుని ఇంకా ఎక్కువ గాలి వేయాలి, ఇంకా ఎక్కువ వర్షం కురవాలి, చెట్లు పడిపోవాలి, రోడ్లు మునిగిపోవాలి.మొత్తం ఆకాశం చీకటిగా అయిపోవాలి అని ఆశగా వర్షం వంక చూసిన రోజులు ఈ మట్టి బుర్రకి ఇంకా గుర్తున్నాయి. అలా చూస్తుండగానే అప్పటికే స్కూల్ కి బయలుదేరిన వారు సైకిల్ మీద వెనక్కి వస్తుంటే స్కూల్ లేదు అన్న విషయం తెలిసినప్పుడు కలిగిన ఆనందం ఏంటో ప్రత్యక్షంగా చూసిన మా అమ్మనడగండి. హమ్మయ్య ఈ రోజుకి స్కూల్ లేదు అని గట్టిగా ఊపిరి పీల్చుకుని కృతజ్ఞతగా వర్షానికి థ్యాంక్స్ చెప్పేవాణ్ణి. " బట్తలు మార్చుకుని పుస్తకాలు తీసి హాల్ లో కూర్చుని చదువుకొ..ఆ కిటికీ తలుపులు మూసెయ్యి జల్లు కురుస్తుంది...!!" - వంట గదిలోంచి పప్పు చారుకి పోపు వేస్తూ మా అమ్మగారు చెప్పే సాధారణ వాక్యం. నా రగ్గు తీసి కప్పుకుని మంచానికి కొసన కిటికీ దగ్గర కూర్చుని బ్రూ కాఫీ (వర్షం పడినప్పుడు మా అమ్మని బతిమాలి మరీ కాఫీ తాగేవాణ్ణి!!) తాగుతూ అలా ఆలోచిస్తూ కూర్చుంటే...!! ఆ అనుభూతిని అనుభవించిన మనసుది ఎంత అదృష్టం!! .

ఓ పక్కన చినుకుల చిట పటలు మరో ప్రక్క వంటింట్లో వేగుతున్న ఒడియాల చిటపటలు. ఆ శబ్దం ఇంకా చెవుల్ని వదళ్ళేదు!! ఆ పప్పు చారు రుచీ ఇంకా నాలుకని వీడలేదు!!. భోజనాలు కాగానే కాస్త వర్షం హోరు తగ్గింది అని తెలియగానే బయటకి వచ్చి పేపర్ తో పడవలు చేసి మా అన్నయ్య, అక్క తో కలిసి అప్పటికే నీటితో నిండిన వాకిట్లో వదిలే వాళ్ళం. అవి అలా కాసేపు సాఫీగా ప్రయాణించి వెళ్ళి డ్రైనేజీ లో కలిసేవి. ఆ కాస్త " పడవ ప్రయాణానికే " ఒళ్ళు పులకరించిపోయేది. అదో అద్భుతం. అదో ఎచీవ్మెంట్..నేను చేసిన పడవ అంత ముద్దుగా ఆ వర్షం లో అలా తడుచుకుంటూ వెళ్తుంటే ఏదో సాదించానన్న గర్వం. ఈలోపు వర్షం లో తడుస్తున్నారా? వచ్చి పడుకోండి..ఆ తలుపులు దగ్గరకి వేసి గెడ పెట్టి రా బాబి..!! " అని మా అమ్మ పిలుపు కి అందరం అప్పటికే చాప వేసి దాని మీద బొంత పేర్చి ఉండేది అందరం తలా ఒక రగ్గు తెచ్చుకుని ఎవరి దుప్పట్లోకి వాళ్ళు దూరేసేవాళ్ళం. సాయంత్రం లేచి చూసేసరికి కారు చీకట్లతో వర్షం భీభత్సంగా కురిసేది. అమ్మా!! వేడి వేడిగా ఏదైనా చెయ్యొచ్చుగా? అంతే " అటుకులని బాగా నూనెలో వేయించి ఉప్పూ కారం జల్లి వేడి వేడి గా తినేవాళ్లం.
ఆ రాత్రికి మళ్ళీ మిగిలిన పప్పు చారులో ఆంలెట్ చేసుకుని నంజుకుని భోజనం ముగించేవాళ్ళం. ఆ రాత్రికి పడుకునే ముందు రేపు కూడా ఇలా వర్షం తగ్గకుండా ఉంటే బాగుండు!! అని ఓ చిన్న ఆశతో పడుకున్నాం. ప్రొద్దున్నే లేచేసరికి వర్షం తెరిపిచ్చి సూర్యుడు అప్పుడే సిగ్గుపడుతూ వచ్చాడు. కాలనీ పెద్దలంతా విరిగిపోయిన చెట్లను నరకడం లోనూ, కరెంట్ తీగలు ఎక్కడెక్కడ తెగిపోయాయో చూసి కరెంట్ ఆఫీసు కి ఫోన్ చేసే పనిలో నిమగ్నం అయ్యేవారు. అక్కడ అలా జరిగిందట, ఇక్కడ ఇలా జరిగిందట అని ఆడవాళ్లంతా వాకిట్లో రాలిపోయిన ఆకుల్ని కాయల్ని ఊడుస్తూ చెప్పుకునేవారు.

****************************************************************

వర్షం పడుతూనే ఉంది. తడిసిన బట్తలు ఇంకా ఆరలేదు. ఆఫీస్ లో నా క్యాబిన్ లో కూర్చుని కిటికీ వైపు చూస్తూ ఉన్నా .. ఇంతలో మా అసిస్టెంట్ వచ్చి - "సార్ ఉంగళకు కాఫీ..సూడా సాపాడు సార్" (సార్ మీకు కాఫీ..వేడిగా తాగండి సార్) - అలాగే ఆ పక్కన పెట్టు.

ఆ రేవు (కాకినాడ) నుంచి ఈ రేవుకి (మద్రాసు) ఏ నావలో మోసుకొచ్చిందో మా ఇంటి మట్టి వాసన్ని ఈ మాయదారి గాలి !!!

హోం సిక్ (2)


రెండున్నర సంవత్సరాల తర్వాత మా అన్నయ్య ఇండీయాకి వచ్చాడు. ఇల్లంతా మంచి కోలాహలంగా ఉంది. మా అక్క, బుల్లి రాక్షసి (లక్ష్మి దీపిక) అందరూ ఉన్నారు. - ఒరేయ్ నువ్వెప్పుడొస్తున్నావ్? అసలు వచ్చే ఉద్దేశం ఉందా? నేను వచ్చి 15 రోజులైంది..ఇంకా 15 రోజులు మాత్రమే ఉంటా ..త్వరగా లీవ్ పెట్టుకుని రా!! అని మా అన్నయ్య చంపేస్తున్నాడు. నాకూ వెళ్ళాలనే ఉంది. ఏప్రియల్ 1 న బయలుదేరా.. ఎంతో ఆత్రుతతో ... ఈ సారి ప్రయాణం సరి కొత్తది.. చాలా సంవత్సరాల తర్వాత మా ఫ్యామిలీ అంతా కలుసుకుంటున్నాం
************************************************************************************
మా ఇంట్లొ మా అమ్మమ్మగారు, మా అమ్మ, మా నాన్న గరు, అన్నయ్య, అక్క & నేను. గత ఐదారేళ్ళుగా అందరూ కలిసున్నది ఇప్పుడే... ఈ సారి ఒకటే లక్ష్యంతో వెల్తున్నా మా అన్నయ్యను కలవాలి.. ఇంట్లో వాళ్ళతో హాయిగా నవ్వుతూ మాట్లాడాలి..బాగా అల్లరి చెయ్యాలి. దసరా, దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి పండగలకు నేను ఇంటికి వెళ్ళినా సరిగ్గా మాట్లాడలేదు..నేనేదో లోకంలో ఉండేవాణ్ణి లెండి. ఈ సారి అలా కాదు. చాలా ప్రశాంతంగా ఉన్నా... అంతకు మించి ఆనందంగా ఉన్నా..
**********************************************************************************
ఎప్పటిలాగే .. నేనెక్కబోయే ట్రైన్ కి నాకంటే తొందరెక్కువ మా ఊరుకెళ్ళిపొవాలని.. నాకంటే ముందే బయలుదేరేసింది..నేను ట్రైన్ మిస్స్ అయ్యా !! ఏదోలా మొత్తానికి అది ఇది పట్టుకుని ఇంటికి చేరేసా... - 10 కి వస్తానన్నావ్ 7:30 కే వచ్చేసావ్ ఏ ట్రైన్ కి వచ్చావ్ రా?- మా నాన్న గారి ఆశ్చర్యం - ఒకటనేం చెప్పను బొలెడు ఎక్కి వచ్చా - క్లుప్తంగా నా సమాధానం.
********************************************************************************
నేను బయట కాళ్ళు కడుక్కుంటుండగానే మా అక్క వాళ్ళమ్మాయి (దీపిక) మెష్ డోర్ లొనుంచి చూసేసి మా అమ్మకి చెప్పింది "అమ్మామ్మా బాబి మామ వచ్చేచాడు.. ఎల్లి తీచుకురా " - ఏరా ఉద్యోగం వచ్చాక కాస్త ఒల్లు పెంచినట్టున్నావేంటి!! - చాలా ఏళ్ళు తర్వాత నన్ను చూసిన మా అన్నయ్య పలకరింపు!. ఒరేయ్ మా అమ్మాయి నువ్వెప్పుడొస్తావా అని తెగ ఎదురుచూస్తుంది ఏ తెచ్చావ్ దానికి- మా అక్క కుశల ప్రశ్నలు ఇలానే ఉంటాయి
********************************************************************************
ఓ పక్క నుంచి మా అమ్మమ్మ గారి సెంటిమెంట్ సీన్స్ --- ఏం నాన్నా ఏం తింటున్నావ్...ఎలా ఉంటున్నావ్.. రెండు నెలలైంది వచ్చి... సరే రా దొసలేస్తున్నాను... మొహం కడుక్కో...!!!! నేను కూడా చాలా సరదాగా ఉన్నాను.. మా ఇంట్లొ వాళ్ళు కూడా....రావడం రావడం మా అన్నయ్య నన్ను వరుడు సినిమా కి తీసుకెళ్ళాడు... మధ్యాహ్నం అక్కడే ఫుడ్ కోర్ట్ లో భొజనం చేసేసి ఇంటికెళ్ళాం. ఇక్కడైనా కాస్త ఇంట్లొ తిండి మింగొచ్చు కదా ఇక్కడకొచ్చాక కూడా ఆ బయట దరిద్రమే?-- మా అమ్మ గారు.
*********************************************************************************
ఆ రోజు సాయంత్రం పెద్ద మీటింగ్ మొదలైంది... మా అన్నయ్య పెళ్ళి విషయం. మా అన్నయ్యేమొ ఇప్పుడే వద్దు అని.. మా వాళ్ళందరూ అసలు కారణం చెప్పు దేనికి ఒద్దంటున్నావ్? - పోని తమరి మనసు లో ఎవరైనా అద్దెకుంటున్నారా!!! చెప్పు పెళ్ళి చేయించేస్తా.. - అని నేను మద్యలో తగులుకున్నా -- నోర్మూసుకుని విను నువ్వు మాట్లాడకు పెద్దవాడిలా - మా అమ్మ గారు! ఇప్పటికే 30 ఏళ్ళు వచ్చేసాయి.. నీ పెళ్ళి చేసేస్తే ..ఇక ఈ చిన్న వెధవ ఒక్కడే మిగులుతాడు... వాడు మేం చేస్తామని ఏమీ ఎదురుచూడడు.. వాడిదెలాగూ జరిగిపొద్ది.. బెంగంతా నీ గురించే !! పోని వాడు చెప్పినట్టు నీ మనసులో ఎవరైనా ఉన్నారా? - అబ్బా ఇక ఈ టాపిక్ వదిలేయండి.. ఎవరూ లేరు .. నేను ఇప్పట్లొ పెళ్ళి చేసుకోను!! అని మా అన్నయ్య తేల్చేసాడు.పోని వాడికి కంగారు గా ఉంటే వాడికి చేసేయండి- నన్నుద్దేశించి మా అన్నయ్య అన్నాడు. నాదేముందన్నయ్యా ఏ ఉద్యోగమూ లేకపోతే ఏ సినిమాళ్ళోకో వెళ్ళిపోతా... మన కోసం గోదారి గట్టు దగ్గర చెరుగ్గడ్డ తింటూ వాలు జడతో కోనసీమ పిల్ల ఎలాగూ ఎదురుచూస్తూ ఉంటది.. ఈ డిస్కషన్ ఇంచుమించు ప్రతి పూటా జరిగింది ఆ తర్వాత.
*********************************************************************************
ఉగాదికి నేను లేనని వేపపూత ఫ్రిడ్జ్ లో దాచి ఉంచింది మా అమ్మ. గుడ్ ఫ్రైడే నాడు నాకు ఉగాది పచ్చడి చేసి పెట్టింది. తల్లి ప్రేమ అంటే అంతే పిచ్చి పిచ్చిగా ఉంటుంది.. అని పైకి అంటూ తింటున్నాను.. ఈలోపులొ మా అమ్మ పక్కనే కూఒర్చుని.. వెధవళ్ళారా పెళ్ళాలొచ్చేదాకా తల్లి కొంగట్టుకుని తిరుగుతారు.. వాళ్ళొచ్చాకా వాళ్ళకొంగట్టుకు తిరుగుతారు.. వాళ్ళ పాటే పాడతారు.. అప్పుడు అమ్మ వండిన కూరలు చేదైపోతాయి.. ఎంత మందిని చూడలేదూ..నా పిల్లలేమైనా మినహాయింపా!!! అని మనసులో మాట కక్కేసారు మా అమ్మ. --నిజమేగా - అలా కాదులేవే అని నా చేత చెప్పించాలనుకున్న మా అమ్మగారికి నా సమాధానం అది!! ఒరేయ్ మీరేంచేసినా నాకు మంచి కోడలు రావాలి..మీరు సంతోషంగా ఉండాలి.. ఎవరైనా కోరుకునేది ఒక్కటే... "కోరుకున్నప్పుడు కారులో వెళ్ళినా అవసరమైనప్పుడు ఆటోలో వెళ్ళగలిగేలా ఉండాలి... సరదాపడి సంబారన్నం తిన్నా సరిపోనప్పుడు చారన్నంతో సర్దుకోవాలి. పరిస్తుతులను అర్ధం చేసుకోవాలి. అభిమానంగా ఉండాలి.. అందరితోనూ కలిసిపోవాలి. ఆస్తులు ఈవేళ లేని వారికి రేపొస్తాయి.. ఈ రోజు ఉన్నవారికి రేపు ఉండకపోవచ్చు..మిగిలిపోయేది అనుబంధాలు, అనురాగాలు మాత్రమే" నాకలాంటి కోడలు కావాలి తేగలవా? " -- నా దగ్గర మాటళ్ళేవు మౌనం మాత్రమే మిగిలుంది. ఇక ప్రతీ రోజూ ఇంటికెవరో రావడం మమ్మల్ని పలకరించడానికి..మేం కూడా తెలిసినవారింటికెళ్ళి రావడం ఇదే జరిగింది.. అన్ని చోట్లా ఒకటే డిస్కషన్... కెరీర్ ...పెళ్ళి ఈ రెండే.. అప్పుడర్ధమైంది నాకు.. ఓహ్ నేనూ పెద్దోన్నౌతున్నారొయ్" అని. రోజూ అళ్ళరే.. గొడవలు.. నాకది చేసి పెట్టమంటే నాకది చేసి పెట్టమని.. మా అక్క వాళ్ళమ్మాయితో పోటీగా అల్లరి చేసా.. చిన్నోడు కూడా లేక ఇల్లు స్మసానం లా తయ్యారైంది రా.. అని మా అన్నయ్యతో మా అమ్మమ్మగారు చెప్పారు. మళ్ళీ మా ఇంటికి పూర్వ వైభవం వచ్చినట్లైంది..మేమందరం ఓ చోట చేరేసరికి. ఈ జర్నీతో అర్ధమైంది మా అన్నయ్యకి నేనంటే ఎంత ఇష్టమో అని.. అంటే నాకోసం ఎవేవో కొని తెచ్చాడని కాదు... కొన్ని వాటిని మనం కొలవలేం..కొన్ని భావాల్ని మనం చెప్పలేం. దాన్ని ఆస్వాదించడమే.. మా వాళ్ళ ప్రేమని కూడా అంతే...

రాయలేని భాష ఇది


చెప్పలేని భావమిది....చూపలేని వేదనిది
రాయలేని భాష ఇది....రాతలన్ని చెరిపినది
మూగమది రోదనిది... నా ప్రాణమునే వీడినది
బంధాలన్నీ తెంచుకున్న పాశమిది

నా హృద్యానవనాన పూసినది... పూటైన పోకుండా వాడినది
ఆ ఆకాశదేశాన మెరిసినది...తారల్లే ఉండకుండా రాలినది
చినుకేలేని ఒక మేఘం నాలో జడివానై కురిసింది
తీగేలేని మదివీణే నాలో కోటి రాగాలేల పలికింది
నీరే లేని సెలయేరే నాలో ఉప్పెనలాగా పొంగిన వేళ .....

చెప్పలేని భావమిది....చూపలేని వేదనిది
రాయలేని భాష ఇది....రాతలన్ని చెరిపినది
మూగమది రోదనిది... నా ప్రాణమునే వీడినది
బంధాలన్నీ తెంచుకున్న పాశమిది

బతికే సాధించాలి!!!


రెండూ రాళ్ళే !

ఒకటి మూలవిరాట్టై గర్భగుళ్ళో పూజలందుకుంటుంది. రెండోది, గుడిముందు గడపై భక్తుల కాళ్ళకు అడ్డొస్తుంది.
ఎందుకీ తేడా? నిన్ను మొక్కడమెందుకు ? నన్ను తొక్కడమెందుకు? అడిగింది గడప

మిత్రమా ...గుర్తుందా? ఒకప్పుడు మనిద్దరం ఒకే కొండ మీద ఉండేవాళ్ళం. ఒక మహా శిల్పి మన కొండకొచ్చాడు. శిల్పంగా మలిచే ప్రయత్నంలో, ఉలితో ఒక దెబ్బ వేయగానే నొప్పి తట్టుకోలేక నువ్వు కుప్పకూలిపోయావు. నేను మాత్రం నిబ్బరంగా నిలబడ్డాను. దేవతామూర్తిగా రూపుదిద్దుకున్నాను. ఆ గాయాల్ని అనుభవించిన ఫలమే ఇది" ..వివరించింది విగ్రహం.

నిజమే!! "వైఫల్యమంటే పోరాటంలో ఓడిపోవడం కాదు.పోరాడే ప్రయత్నమే చేయకపోవడం"

మనం ఆహా ఓహో అని పొగుడుకుంటున్న సచిన్ 76 మ్యాచులు తర్వాత గానీ సెంచురీ చేయలేకపోయాడు..అతను కూడా నీలాగో నాలాగో డీలాపడుంటే. మళ్ళీ తన బ్యాట్ 100 సార్లు ఎత్తే అవకాశం వచ్చుండేది కాదు.

థామస్ అల్వా ఎడిసన్ - ఎలక్ట్రిక్ బల్బ్ కనిపెట్టడంలో 700 వందల సార్లు "విఫలమయ్యాడు". మొదటి ప్రయత్నంతోనే కష్టమని త్యజించేసి ఉంటే మీరు లైట్ వేసుకుని నా ఆర్టికల్ని చదవగలిగేవారా!!!! అతని మాటల్లోనే వినాలంటే "నేను 700 సార్లు విఫలమవ్వలేదు .. బల్బ్ వెలగకపోవటానికి 700 వందల కారణాలు కనుక్కోగలిగాను". ఇతమి విషయంలోనే మరో పర్యాయం అతని ల్యాబరేటరీ పూర్తిగా దగ్ధమైనప్పుడు కృంగిపోలేదు "హమ్మయ్య !! ఇప్పుడు మళ్ళీ తాజాగా నా ప్రయోగాలు మొదటి నుంచీ మొదలుపెట్టొచ్చు" అనుకున్నాడు. అతనికి మనలాంటి సామాన్యులకీ ఒకటే తేడా !! -------- "దృక్పధం" (యాటిట్యూడ్)

ఒక హెలన్ కెల్లర్ , ఒక లాన్స్ ఆరంస్ట్రాంగ్...ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలు మన చుట్టూ ఉంటాయి చెయ్యాల్సిందల్లా లేని పోని ఆత్మన్యూనతా భావపు ముసుగుల్ని తొలగించి క్షణికావాశంలో ఏదో (ఆత్మహత్య) చేసేసుకోవాలన్న భావన నుంచి బయటపడడమే!!

ఇలాంటి ఆలోచనకి ఎవరూ అతీతులు కారు అది నువ్వైనా నేనైనా!! నేనూ చాలా సార్లు ఇలా ఆలోచించినవాణ్ణే (మొన్నీమద్య కూడా) అందుకే నా మీద నాకే భయమేసి ఇలా రాసేస్తున్నా... ఉభయకుశలోపరి.. మీకు సలహా ఇచ్చినట్టౌతుంది ..నాకు కాస్త ఓదార్పు ఏడుస్తుంది.

ఇది వరకూ మనం న్యూస్ పేపర్లో ప్రేమలేఖలూ, ప్రచురనకర్తలకు లేఖలూ చూస్తుండేవాళ్ళం. అదేం దరిద్రమో ఈ మద్య అన్నీ "నా చావుకు ఎవరూ బాద్యత కాదు" అని కొసమెరుపుతో కూడుకున్న లేఖలే. ఒక బలహీన క్షణం, క్షణికావేశం "నిండు ప్రాణాలనే బలితీసేసుకుంటుంది".

"అమ్మా..!!
నేను చచ్చిపోతున్నాను. నాకు బతకాలని లేదమ్మా. ఏం చెయ్యమంటావు చెప్పు. ఎంత చదివినా గుర్తుండటం లేదు. మార్కులు తక్కువొస్తున్నాయి. నిన్న మా ప్రిన్సిపాల్ వార్నింగ్ ఇచ్చారు. ఈ సారి మంచి మార్కులు రాకపోతే ...నాన్న గారిని పిలిపించి మందలిస్తారట నా వళ్ళ నాన్నెందుకు మాటపడాలి? అందుకే చచ్చిపోవాలని నిర్ణయించుకున్నా. రేపు ఐ.ఐ.టీ ఎంట్రన్స్ రాసినా ర్యాంక్ రాదని తెలుసు. అప్పు చేసి కట్టిన లక్ష రూపాయిలూ బూడిదలో పోసినట్టే!! క్షమించమ్మా ...నాన్నకు నా మీద కోపం వచ్చినప్పుడల్లా "పోన్లెండి! పసివాడు, ఏదో తెలియక చేసాడు" అని సర్ది చెబుతుంటావు గా ..ఇప్పుడూ ఆయన్ని అలానే ఓదార్చమ్మా....ఉంటానమ్మా...."

ఇలాంటి లేఖలు లెక్కలేనన్ని ... రోజూ సూర్యుడితో పాటుగా అస్తమిస్తున్న పసి హృదయాలెన్నెన్నో!!!
చదువులోనో, ప్రేమలోనో విఫలమై మానసికంగా కృంగిపోయి ఇక జీవితమే లేదనుకుని తీసుకునే నిర్ణయం వెల ఒక జీవితం, తల్లి పడ్డ తొమ్మిది నెలల వేదన.

బతుకులు బిజీ అయిపోయిన ఈ కాంక్రీటారణ్యంలో మనసు అలసిపోతే సేద తీర్చేది మరో మనసే... అబ్బే అలా లేదు మనం మనమే సొంత నిర్ణయాలు తీసేసుకుంటాం. ప్రాణాలు తీసేసుకుంటాం. "చావటమంటే చచ్చేంత తేలిక!!"

ఒక పడక గదిలో ఉరితాడు బిగుసుకుంటుంది. ఒక వంటింట్లో కిరోసిన్ డబ్బా తెరుచుకుంటుంది, ఒక హాస్టల్ లో నిద్రమాత్రలు కూల్ డ్రింక్ లో కరిగిపోతున్నాయి. ఎవరో సడన్ బ్రేక్ వేసినట్టు, జీవిత చక్రం హటాత్తుగా ఆగిపోతుంది. ఇక కదలదు. వంద పేజీల పుస్తకం అసంపూర్ణంగా ముగిసిపోతుంది. కామా తర్వతా ఏమీ ఉండదు. ఒక చిన్నపాటి శబ్దం. ఒక్కో సారి అది కూడా ఉండదు. అయిపోతుంది ..అంతా అయిపోతుంది. అనుకున్న లక్ష్యాలు నెరవేరనేలేదు ..సాదించాల్సినవి సాధించలేదు. అనుభవించాల్సిన ఆనందాలు అనుభవించలేదు. అర్ధాంతరంగా అకస్మాత్తుగా జీవితం ముగిసిపోతుంది. అన్ని సమస్యలకూ డబ్బే కారణమనుకుంటాం . పేదరికాన్ని మించిన కష్టం లేదనుకుంటాం. వైకల్యాన్ని పెద్ద శాపంగా పరిగణిస్తుంటాం. కానీ ఆత్మహత్య చేసుకుంటున్న వారిలో నిరుపేదలు అతి తక్కువ. వాళ్ళ దృష్టిలో జీవితం ఒక పోరాటం. నోటి దగ్గరకు వెల్తున్న ప్రతీ ముద్దా ఒక విజయానికి ప్రతీక. వికలాంగులెప్పుడూ ఆత్మహత్యకు తెగబడరు. వాళ్ళు వేసే ప్రతీ అడుగూ వాళ్ళకు ఒక గమ్యమే ... అన్నీ ఉన్నా ఏదో లోపాన్ని ఊహించుకుని జీవితాన్ని దుర్భలంగా మార్చుకునేవారే ఆత్మహత్యలకు ప్రయత్నిస్తుంటారు. భార్య బిర్యానీ వండలేదనో, అందాల తార కరచాలనం చేయలేదనో, ప్ప్రియతమ నేత మరనించాడనో చెప్పి ప్రతీ ఐదు నిముషాలకొకటి రాలిపోతూనే ఉంది...వేసవి కాలంలో ఆకుల్లా ....చిన్న చిన్న సమస్యలకు చావులో పరిష్కారం వెతుక్కోవడం రోజు రోజుకూ పెరిగిపోతుంది. అలా అని ప్రతీ ఆత్మహత్య ఆలోచనా చావును కొనితెచ్చుకునే ప్రయత్నం కాదు. సాయం కోసం తుది వేడుకోలు. అవ్యక్తమైన పిలుపు, కన్నీళ్ళు రాలని ఏడుపు. అర్ధం చేసుకునే మనిషి కోసం , వెచ్చని ఓదార్పు కోసం ఎదురు చూస్తున్నామన్న బలమైన సంకేతం. ఆ సమయంలో వాళ్ళక్కావాల్సింది నేనున్నాననే భరోసా, బాధలు వినిపెట్టడానికొక సొంత మనిషి, ఆసరాగా ఓ భుజం. అంతే!!. వాళ్ళను మాట్లాడనివ్వండి మనసారా........ఏడవనివ్వండి వెక్కి వెక్కి తనివితీరా.....అడ్డు చెప్పే ప్రయత్నం వద్దు. ప్రెజర్ కుక్కర్లో వేడి వేడి ఆవిరి విడులైనట్టు వాళ్ళ ఆగ్రహం, బాధ, ఆవేశం, పస్చాతాపం అన్నీ కట్టలు తెంచుకుంటాయి. ఆ తర్వాత మనసు తేలికైపోతుంది.

సుతారంగా సీతాకోక చిలుక రెక్కలు పట్టుకుంటే చాలు ఎగిరిపోవాలని తపిస్తుంది. ప్రాణమంటే అంత తీపి. చిట్టి చీమ మీద చుక్క నీళ్ళు పొయ్యండి తల్లడిల్లిపోతుంది. బతుకంటే అంత ఆశ. మనిషికి మాత్రమే ఈ తొందరపాటు. చచ్చి సాధించాలన్న పిచ్చి. పిడికెడు నిద్రమాత్రలు చాలు. కష్టాలుండవు, కన్నీళ్ళుండవు, అప్పులు తీర్చాల్సిన పనుండదు, మార్కులు తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు..ఏదో శాస్వతమైన విముక్తి అని భావించేస్తాం. పోయింది ఒక ఉద్యోగం మాత్రమే.... మనం ప్రేమించిన వాళ్ళు కాకపోతే మనల్ని ప్రేమించేవాళ్ళు. చదువుకున్న చ్దువుంది, పుచ్చుకున్న పట్టా ఉంది, కన్న తల్లి దండ్రులున్నారు, స్నేహితుల ఆసరా ఉంది ...ఈ మాత్రం సాధనా సంపత్తి చాలు. పడినా లేవడానికి. "నన్ను ప్రేమించే మనుషుల కోసం వెతికితే ఒక్కరూ కనపడలేదు. నేను ప్రేమించడం మొదలు పెట్టగానే ఆ జాబితా రోజు రోజుకూ పెరిగిపోయింది..." ఈ మాత్రం ఆలోచించగల శక్తుంటే చాలు. చావలనుకుని నేను ఆలోచించి విఫలమైన ప్రతీ సారీ "చావలన్న ఆలోచనను గెలిచినందుకు" నాకు గర్వంగా అనిపిస్తుంటుంది. మనం ఓడిపోయామనుకోవడమెందుకు? ఆ విజయమే మనల్ని వరించడంలో విఫలమైందనుకుందాం. ఆ విజయం మీద జాలి చూపిద్దాం. విజయం, ఓటమీ రెండు వేరు వేరు కాదు. గొంగలిపురుగుకూ, సీతాకోక చిలుకకు ఉన్నంత తేడా ఉంది. ఈ రెండూ ఒకటే వాటి దశలే (స్టేజస్) తేడా ... వైఫల్యమంటే....విజయానికి ముందు దశ. అలా కాదనుకుని గొంగలిపురుగు మరో సీతాకోక చిలుకని చూసి బాధపడి ఆత్మహత్య చేసుకుంటే మరో తను సీతాకోకచిలుకగా మారగలదా. అందుకే చచ్చి మనమెం సాధించలేం. బతికి సాధించాలి....బతికే సాధించాలి!!!!.

ఉరిమే మేఘమా ... కరిగిపోవద్దు కన్నీరై...


ఉరిమే మేఘమా ... కరిగిపోవద్దు కన్నీరై
తరిమే కాలమా... తరలిపోవద్దు గతానివై
విరహం..శ్వాసగా..మనసు చేరింది ఈ వేళ
ప్రతి నిముషం ఆశగా ఎదురు చూసింది రావేలా?

(||ఉరిమే మేఘమా||)

ప్రేమంటూ ఒకటుందని నాకసలే తెలియదులే నువు పరిచయమయ్యేవరకూ
ఆవేదనంటేనే తెలిసిందిలే ఇపుడు నువు దూరం అయ్యేసరికి
గారంగా పిలిచాను..గాఢంగ వలచాను తెలియనిదా నీకే అది
మౌనంగా నువ్వుంటే ఏమనుకోవాలసలు నీకైనా తెలుసా మరీ
ఉందనా......లేదనా....నా మీద నీకే ప్రేమా!!

(||ఉరిమే మేఘమా||)
రానున్న రోజుల్లో కలిసుండాలనుకుంటూ గడిపాను ప్రతి రోజునీ
గతమంతా నీ జాడే ఉండాలనుకుంటూనే నిను తలిచాను ప్రతి నిముషమూ
నీ ఒడిలోనే నా ప్రాణం కడతేరిపోవాలి అది మాత్రమే కోరిక
నీ చూపుల్లో ఏ భావం దాగుందో నేడు తెలిసేదెలా నాకిక
ఔననా.....కాదనా ...ఇన్ని ప్రశ్నలకొకే మౌనమా?

(||ఉరిమే మేఘమా||)

ఈ క్షణాన నా స్వరా....


ఈ క్షణాన నా స్వరాన పదాలు ఆడేనా
ఈ జగాన ఎవరైనా నాతోటి పాడేనా
కళ్ళు తెరుచుకున్న మనసుకు లోకమంతా కొత్తేగా
ఒళ్ళు విరుచుకున్న వయసుకు కొత్త ఈడు వింతేగా
కాలు జారి పడ్డ మనసుకి ప్రేమ లోతు తెలియగా
చేయి జారి పోదా వయసు.. మనసు తేలేలోపుగా
ఈ క్షణాన నా స్వరాన పదాలు ఆడేనా
ఈ జగాన ఎవరైనా నాతోటి పాడేనా

కొత్తగొంతు ఎవరిదంట ఆమనింట పలికెనంట
సిగ్గుపడుతూ చెప్పెనంట లేత చిగురే ఆ చిన్నదెవరో
కోయిలమ్మదంట కొత్తకోడలంట
పేరంటానికంట పిలుపులీయమంటూ చల్లగాలికి కబురు పంపెనూ
కోకిలమ్మ చేతివంట రుచి చూడగానే రేగెనంట వేపపూత మనసులోన తీపి కోరిక

ఈ క్షణాన నా స్వరాన పదాలు ఆడేనా
ఈ జగాన ఎవరైనా నాతోటి పాడేనా

తోరణాలు కట్టించవమ్మ సన్నజాజీ చేతితో
వాయినాలు ఇప్పించవమ్మ మల్లెపూల గంధాలతో
తుమ్మెదమ్మకేమో సారెలీయవమ్మా...
రామచిలకకేమో పట్టు చీరలంటలేమ్మా ..బొట్టు పెట్టు మందారమా
ఎన్నెన్ని పందిళ్ళో ..ఎన్నెన్ని సందళ్ళో కొమ్మకొమ్మకీ కట్టుకున్న కోటలో...

ఈ క్షణాన నా స్వరాన పదాలు ఆడేనా
ఈ జగాన ఎవరైనా నాతోటి పాడేనా