skip to main |
skip to sidebar
ఈ రోజు మనకోసం ఒక మంచి ఏర్పాటు చేసా....కుర్చీలు వేయించేసా...ఇప్పుడు హాయిగా ఉందికదండి...ఆ ఈ కాఫీ తీసుకొండి ..చల్లారిపోతుంది...ఆ భళే వారే దానిదేముంది లెండి..ఏం మొన్న మీ ఇంటికొస్తే మీ ఆతిధ్యం మేము స్వీకరించలేదా ఏం...ఆ ఆ ఆమొక్కేనా రెండు నెలల క్రితం మీ చేతులతో నాటించి నీరు పొయించిన మొక్కే...చూసారా అప్పుడే ఎంతగా ఎదిగిందో..ఆ పువ్వులు చూడండి గుబురుగా ఎలా విరగ పూసాయో!!!..అంతా ప్రకృతి సృష్టే..ఔను మొన్న మీకేదో చెబుతూ మద్యలో ఆపేసాను చీకటి పడిందని ఏమిటది...? ఆ ఆ అదే మా అన్నగారి సమయస్పూర్తి గురించి కదా...చెబుతా ...
నేను ఏడవ తరగతి చదువుతున్నాను (పన్నెండేళ్ళ క్రితం మాట లెండి). సాయంత్రం ఇంటికొచ్చాక కాసేపు మా వీధిలొనే (వీధి దాటి వెళ్ళకుండా )పెద్ద సైకిల్ తొక్కుకునేవాడిని. ప్రతి రోజులాగానే ఆ రోజు కూడా తొక్కుకుంటుంటే. మా స్కూల్ లో నాతో పాటూ చదివే స్నేహితుడు కనిపించాడు. ఒరెయ్ మనం పార్క్ కి వెల్లి ఆడుకుందామా అన్నాడు. 2 కిలోమీటర్లు దూరం అంతే అన్నాడు. ముందు నేను అమ్మో భయం నేను అంత దూరం రాను. మా అమ్మ కొడుతుంది అంటే చెబితే కదరా తెలిసేది. కాస్త ఐదు నిముషాలు ఆడుకుని వచ్చేద్దాం చాలా బాగుంటుంది అన్నాడు. పార్క్ కదా (మనం ఎప్పుడూ వెళ్ళలేదులెండి) అని సరదా పడి వెళ్ళాను. సైకిల్ అక్కడ పెట్టి తాళం వేసి ఆడుకొవడం మొదలుపెట్టాను. అసలే నాకు భయం కదా..తాళం అస్తమానం చూసుకునే వాణ్ణి ఉందో లేదో అని. వాడు అది గమనించి ఒరెయ్ నేను ఒక ఉపాయం చెబుతాను అలా చేస్తే తాళం ఎక్కడా పడిపోదు అని చెప్పి. బొత్తానికి మధ్యలో అది పెట్టి బొత్తం చొక్కాకు పెట్టాడు (అది చాలా తెలివైన ఉపాయం). సరే అలానే పెట్టుకున్నాను. అయినా అనుమానం చాలా భయంకర్మైంది. పడిపోతుందేమొనని అనుకుని మళ్ళీ తీసేసి జేబులో పెట్టుకున్ని. ఏడు పెంకులు ఆట ఆడుకుంటున్నాను. బాల్ ని గురి చూసి కొట్టా...పెంకులు పగిలాయి. పరిగెడుతూ నా జేబు తడుంకున్నాను. తాళం కనపడలేదు. అప్పుడు నా గుండె పగిలింది. వెంటనే ఆట ఆపేసి వెదకడం మొదలుపెట్టాం. పొవడం అంటే తేలిక గాని దొరకడం కష్టం కదా...దొరకలేదు. సమయం కాలం మీద స్వారీ చేస్తుంది. సూర్యుడు బట్టలు సర్దుకుంటున్నాడు వలస వెళ్ళడానికి. నా గుండె నెలలు నిండిన చూలాలు లాగా కొట్టుకుంటొంది. వాడు వెళ్ళిపోతాను టైం అయిపొయింది హోం వర్క్ లు చేసుకోవాలి అన్నాడు. నాకు తెలియని హోం వర్క్ లు ఏమున్నాయి రా..కాసేపు వెదక రా అన్నాను. మా నాన్న తంతాడు అన్నాడు. మరి నన్ను ఎందుకు తీసుకొచ్చావ్ ఇక్కడికి. మా నాన్న మాత్రం ముద్దెట్టుకుంటాడా?. కాసేపు వెదుకు అన్నాను. వాడన్నాడు మా ఇంట్లొ ఒక తాళం ఉంది రా అది పనికొస్తదేమో తేనా అని ఊరించాడు. సరే తే అన్నాను...సరే అని చెప్పి వెళ్ళిపొయాడు...వాడు ఇప్పటికీ ఆ తాళం తేలేదు అనుకొండి..అప్పుడు అర్ధమయింది మన వాడు. పలాయనం చిత్తగించాడు అని. ఇక చూద్దురు కదా నా కష్టం. అసలే పెద్ద సైకిలొకటి. చీకటి. ఐదు నిముషాలే కదా అని ఐదు గంటలకు బయలుదేరా. ఏడు అయ్యింది..సైకిల్ ను ఈడ్చుకుంటూ ...ఏడ్చుకుంటూ వచ్చాను.వచ్చే సరికి ఇంటి వాకిలి ముందు విజయుడై తిరిగొస్తున్న వీరుడికి ఆహ్వానం పలకడానికి నుంచున్నట్లు నుంచున్నారు మా అక్క అన్నయ్య. వాళ్ళకు చాలా ఆనందంగా ఉందనుకొండి నన్ను తన్నించడానికి. అన్నీ తెలుసుకుని నాకివ్వాల్సినవి ఇచ్చేసారు. పెట్టాల్సినవి అన్నీ లాంచన ప్రాయంగా పెట్టేసారు. అప్పుడు మా అన్నయ్య నా దగ్గరకొచ్చి...ఏరా 2 కి.మీ సైకిల్ ని ఈద్చుకుంటూ వచ్చావా...ఇదే పరిస్తితి నాకు ఒకటవ తరగతిలొ ఎదురైంది..నేనేం చేసానొ తెలుసు..రిక్షా ఒకటి మాట్లాడి అందులో వేసి వచ్చేసా...అన్నాడు..మరి డబ్బులు ఎక్కడివి అని ముక్కు చీదుకుంటూ అడిగా...అప్పుడు మా అన్నయ్య...పిచ్చి వెధవ నాకెక్కడివి డబ్బులు ఇంటికొచ్చాకా మా అమ్మ ని అడిగి ఇప్పిస్తా అన్నాను. పడాల్సిన దెబ్బలు ఎలాగూ పడతాయి. కాస్త రిక్షా లొ వచ్చాను అంతే తేడా అన్నాడు నవ్వుతూ....అప్పుడర్ధమైంది "సమయస్ఫూర్తి" అంటే ఏమిటో.....
0 comments:
Post a Comment