skip to main |
skip to sidebar
ఉరిమే మేఘమా ... కరిగిపోవద్దు కన్నీరై
తరిమే కాలమా... తరలిపోవద్దు గతానివై
విరహం..శ్వాసగా..మనసు చేరింది ఈ వేళ
ప్రతి నిముషం ఆశగా ఎదురు చూసింది రావేలా?
(||ఉరిమే మేఘమా||)
ప్రేమంటూ ఒకటుందని నాకసలే తెలియదులే నువు పరిచయమయ్యేవరకూ
ఆవేదనంటేనే తెలిసిందిలే ఇపుడు నువు దూరం అయ్యేసరికి
గారంగా పిలిచాను..గాఢంగ వలచాను తెలియనిదా నీకే అది
మౌనంగా నువ్వుంటే ఏమనుకోవాలసలు నీకైనా తెలుసా మరీ
ఉందనా......లేదనా....నా మీద నీకే ప్రేమా!!
(||ఉరిమే మేఘమా||)
రానున్న రోజుల్లో కలిసుండాలనుకుంటూ గడిపాను ప్రతి రోజునీ
గతమంతా నీ జాడే ఉండాలనుకుంటూనే నిను తలిచాను ప్రతి నిముషమూ
నీ ఒడిలోనే నా ప్రాణం కడతేరిపోవాలి అది మాత్రమే కోరిక
నీ చూపుల్లో ఏ భావం దాగుందో నేడు తెలిసేదెలా నాకిక
ఔననా.....కాదనా ...ఇన్ని ప్రశ్నలకొకే మౌనమా?
(||ఉరిమే మేఘమా||)
ఈ క్షణాన నా స్వరాన పదాలు ఆడేనా
ఈ జగాన ఎవరైనా నాతోటి పాడేనా
కళ్ళు తెరుచుకున్న మనసుకు లోకమంతా కొత్తేగా
ఒళ్ళు విరుచుకున్న వయసుకు కొత్త ఈడు వింతేగా
కాలు జారి పడ్డ మనసుకి ప్రేమ లోతు తెలియగా
చేయి జారి పోదా వయసు.. మనసు తేలేలోపుగా
ఈ క్షణాన నా స్వరాన పదాలు ఆడేనా
ఈ జగాన ఎవరైనా నాతోటి పాడేనా
కొత్తగొంతు ఎవరిదంట ఆమనింట పలికెనంట
సిగ్గుపడుతూ చెప్పెనంట లేత చిగురే ఆ చిన్నదెవరో
కోయిలమ్మదంట కొత్తకోడలంట
పేరంటానికంట పిలుపులీయమంటూ చల్లగాలికి కబురు పంపెనూ
కోకిలమ్మ చేతివంట రుచి చూడగానే రేగెనంట వేపపూత మనసులోన తీపి కోరిక
ఈ క్షణాన నా స్వరాన పదాలు ఆడేనా
ఈ జగాన ఎవరైనా నాతోటి పాడేనా
తోరణాలు కట్టించవమ్మ సన్నజాజీ చేతితో
వాయినాలు ఇప్పించవమ్మ మల్లెపూల గంధాలతో
తుమ్మెదమ్మకేమో సారెలీయవమ్మా...
రామచిలకకేమో పట్టు చీరలంటలేమ్మా ..బొట్టు పెట్టు మందారమా
ఎన్నెన్ని పందిళ్ళో ..ఎన్నెన్ని సందళ్ళో కొమ్మకొమ్మకీ కట్టుకున్న కోటలో...
ఈ క్షణాన నా స్వరాన పదాలు ఆడేనా
ఈ జగాన ఎవరైనా నాతోటి పాడేనా
ఆమని పాడింది కోయిలలా...వేసవి కాసింది వెన్నెలలా
మనసంత ఊగింది ఈవేళ...నీ రాగాలు వినగానే వేణువులా
నీ నవ్వులన్నీ విల్లులై హరివిల్లులై పూసే విరబూసే
తెల్లవారితే మంచులో విరిసేను పూవులు హారాలుగా
రాతిరేలలో కన్నుళ్ళో వెలిసేను కలలన్నీ కావ్యాలుగా
పంటలేసి ఆడాలి అల్లరులే వెల్లువలుగా
వంతులేసి పాడాలి మారాలన్నీ పల్లవులుగా
చలిమంట జాములో సిరిపంట పండెనా
తుదికంట నీ ఒడిలో తలవాల్చి ఉండనా మనసారా నిను కోరా
పూల ముళ్ళుల్లే హత్తుకోగా మనసంత సుతిమెత్తగా
వానజల్లులే చేరుకోగ నేలంతా మెలమెల్లగా
సరదాలు సయ్యాటలాడాలిలే నీ సరసాలలో
పరదాలు తొలగాలి చలిగాలిలో చెలి చెరసాలలో
నీ కాలి అందెలే...నా గుండె లయలుగా
నా కాలి అడుగులే.. నీ దారి మల్లగా ..రానా...దరిరానా
ఆమని పాడింది కోయిలలా...వేసవి కాసింది వెన్నెలలా
మనసంత ఊగింది ఈవేళ...నీ రాగాలు వినగానే వేణువులా
నీ నవ్వులన్నీ విలులై హరివిల్లులై పూసే విరబూసే
ఏ చినుకున దాగిన స్వాతి ముత్యమో
ఎవరి ఎదన పూచిన శ్వేత పుష్పమో
నా కలము కాంచని కావ్య కన్యవో....
శూన్యమైన నా చూపులోన నువు హరివిల్లు చిలికినావే
చీకటైన నా గుండె లోతులలో వెన్నెలై వెలిగావే
గాలి తెమ్మెరకు ...నీటి తామరకు తేలి ఆడినావే
(||ఏ చినుకున||)
మోడుబారిన బ్రతుకులోన నువు ఆమనై వెలిసావే
వేదనైన ఈ జీవితాన నువు గోదారిలాగ పొంగావే
మూగ మురళిని మరల వెదురుగ మార్చి తరలిపోకే
(||ఏ చినుకున||)
ఏ చినుకున దాగిన స్వాతి ముత్యమో
ఎవరి ఎదన పూచిన శ్వేత పుష్పమో
ఏ వేణువున రేగిన నవ్య నాదానివో.....నువ్వు నా దానివో!
నాకన్నీ జ్ఞాపకమే
అరుగు మీద అక్కతో కలిసి బుడుకులుతో ఆడుకోవడం
చీపురు పుల్లలతో బాణాలను చేసుకుని కానుగ చెట్ల ఆకులకు గురి చూసి కొట్టడం
ఇసుక గూళ్ళను కట్టడం...పెంకిటుల్లుకున్న దూలాలకు వేలాడడం
నాకన్నీ జ్ఞాపకమే
అమ్మ ఇచ్చిన అర్ధరూపాయి పడేసుకున్నప్పుడు కలిగిన భయం
నన్ను కొట్టాడని చెప్పి నాన్న చేత అన్నయ్యను కొట్టించినప్పుడు కలిగిన ఆనందం
సైకిలు నేర్చుకుంటూ కింద పడి మోకాళ్ళకు కలిగిన గాయం
నాకన్నీ జ్ఞాపకమే
ఉడకపెట్టుకుని తిన్న చిలకడ దుంపలు, వేయించుకుతిన్న వేరుసెనగ గుళ్ళు...
ఎండపెట్టుకుని తిన్న రేగు ఒడియాలు...ఊరపెట్టుకుతిన్న రావి ఉసిరికాయలు..
కొనుక్కుని తిన్న తవుడు బిస్కెట్లు....కాల్చుకు తిన్న పనస పిక్కలు, పొత్తులు, తేగలు
నాకన్నీ జ్ఞాపకమే
ఆడుకున్న ఏడు పెంకులాట...నేలాబండా ఆట,
దొంగా పోలీసు, అష్టా చెమ్మా..
రాముడూ సీతా, అమ్మా నాన్న ఆట
నాకన్నీ జ్ఞాపకమే
ఏరుకున్న గురివింద గింజలు...చెప్పులకు గుచ్చుకున్న పల్లేరు కాయ ముళ్ళులు..
జేబుకు మరకలైన ఇంకు పెన్ను...పెన్సిలు చెక్కుకుంటూ చేతికి గాయం చేసిన బ్లేడు,
అక్కిచ్చిన చెక్క స్కేలు...అన్నయ్య వాడేసి ఇచ్చిన కంపాస్ బాక్సు
నాకన్నీ జ్ఞాపకమే
గాల్లోకి ఊదిన నీటి బుడగలు...తెగిపొయిన గాలిపటాలు
వలవేసి పట్టిన చిన్న చేపలు...వాన నీటిలో వేసిన కాగితం పడవలు
కొబ్బరి ఆకులతో అల్లుకున్న బొమ్మలు...తాటాకులతో చేసుకున్న విసిన కర్ర
నాకన్నీ జ్ఞాపకమే
వినాయక చవితికి కట్టుకున్న పాలవెల్లి, చూసిన వీధి సినిమా....శ్రీ రామ నవమికి తాగిన పానకం
నవరాత్రుల్లో నవమి రోజున గుల్లో భొజనాలు...సంక్రాంతి కాలంలో హరిదాసు చేసిన చేతి తాళాల చప్పుల్లు కాలి గజ్జెల సవళ్ళు
నాకన్నీ జ్ఞాపకమే
చెప్పిన అబద్దాలు....దాచిన నిజాలు, కలిగిన అనుభవాలు..చెరిగిన కలలు...చెదిరిన ఆశలు
అన్నీ జ్ఞాపకమే నాకన్నీ జ్ఞాపకమే