skip to main |
skip to sidebar
వీళ్ళుండేది కూడా మా కాలనీ లోనే..చిన్నప్పటి నుంచీ "ఫ్యామిలీ ఫ్రెండ్స్" ఈయన తల్లిదండ్రులూ..మా తల్లిదండ్రులూ మంచి సన్నిహితులూ....మాకు మార్గదర్శకులు (ఒక రకంగా!!). ఇతనిని శ్రీకాంత్ అని ఇంట్లొ ముద్దుగా పిలిచేవారు. నేను శ్రీకాంత అన్నయ్య అని పిలిచేవాడిని ఒకప్పుడు !! ఉండేది ఒక చోటే అయినా చాలా అరుదుగు చూసాను ఇతనిని..ఇంట్లో ఉన్నా లేనట్టే ఉండేవాడు...నేను అతి దగ్గర నుంచి చూసిన అత్యంత తెలివైన (చదువు విషయంలో) వారిలో అగ్రగన్యుడు. అతని పదవ తరగతిలో 535 మార్కులు వచ్చాయట (అప్పట్లో..1998 అనుకుంట). పాపం తక్కువ వచ్చాయని బాధపడ్డాడట !!! పేపర్లో మాత్రం ఫొటొ వచ్చింది..అప్పుడు నాకివేం తెలియవు. మనం "అమాయక చక్రవర్తి" కద అప్పుడు. అతనికి మొదటి నుంచీ "సివిల్ సర్వీసెస్" మీదే ఉండేది ద్రుష్టంతా!! కాని ముందు ఏదో ఉద్యొగం చెయ్యి. నీ కాళ్ళ మీద నువ్వు నిలుచున్నాకా నువ్వు ఇష్టం వచ్చింది చెయ్యి అని ఇంట్లో వాళ్ళు చెప్పారట. ఇష్టం లేకుండానే ఇంటర్మీడీట్ బై. పీ. సీ లో జాయిన్ అయ్యాడు ఆదిత్య జూనియర్ కాలేజీ లో ఇష్టం లేని చదువులోనే ఇంటర్ స్టేట్ 9 ర్యాంక్ వచ్చింది..అంతకు ముందు పాలిటెక్నిక్ మరియు ఏ.పి.ఆర్.జే.సీ లలో రాష్ట్ర మొదటి ర్యాంక్ వచ్చింది. తర్వాత ఎం.సెట్ మెడికల్ రాష్ట్ర స్తాయి లో 14 ర్యాంక్ వచ్చింది అప్పుడు మా కాలనీ లో చేసిన సంబరాలు అంతా ఇంతా కాదు!! అది కాదు అసలు విషయం ...ఎం.సెట్ అవ్వగానే "దేశంలోనే మెడికల్ కి సంబందించిన అత్యంత ప్రతిష్టాత్మకమైన పరీక్ష ఏ.ఎఫ్.ఎం.సీ పరీక్షలో జాతీయ స్తాయిలో మొదటి ర్యాంక్ సంపాదించిన మొట్టమొదటి ఆంద్రుడు" అని పేపర్లో చదివినప్పుడూ..దూరదర్షన్ వార్తలలో చూసినప్పుడు...నేను పొందిన అనుభూతి చెప్పలేనిది..అదేదో నేనే పొందినట్టు ఆనందభాష్పాలు జలజలా రాలిపోయాయి. చివరికి అతను ఉస్మానియా యూనివర్శిటీలో మెడిసెన్ లో జాయిన్ అయ్యాడు...విజయవంతంగా పూర్తి చేసాడు..అప్పుడే తనకి ఇష్టమైన "సివిల్ సర్వీసెస్" మీద దృష్టి పెట్టాడు..పగలు రాత్రి అని తేడా లేదు తనకి. ఒక పక్క అత్యంత కష్టమైన ఎం.డి పరీక్షకి ప్రిపేర్ ఔతూనే దీనికీ ప్రిపరేషన్ మొదలుపెట్టాడు. ఎం.డి జనరల్ సర్జన్ చేసాడి..అప్పటికి "సివిల్ సర్వీసెస్" లో రెండు ప్రయత్నాలలో విఫలమయ్యాడు...పరాజయమంటే ఏంటో మొదటి సారి రుచి చూపించంది. అయినా "పట్టుదల" కి ఇది గుర్తులేదు "శ్రమ" సాగుతూనే ఉంది. మూడోసారి "ప్రిలింస్" అదిగమించాడు.."మయిన్స్" ఈ సారి అతని దీక్షకి తలొగ్గింది. ఇక చివరిగా "సివిల్స్ ఇంటర్వ్యూ" దేశంలో అత్యంత ప్రామాణికమైన ఇంటర్వ్యూలలో మొదటి స్థాయి అది. అతను ఇంటర్వ్యూ కి డిల్లీ వెల్తున్న రోజు నాకు ఇంకా గుర్తుంది. "ఆల్ ది బెస్ట్ అన్నయ్యా" అన్న మాట కూడా గుర్తుంది. అతని పట్టుదల ముందు నా ఆశీస్సులనగా ఎంత!!! పూర్తి చేసి వచ్చాడు...ఎప్పటిలాగానే తను హైదరబాద్ లో హాస్పిటల్ లో ఎం.డి చేస్తున్నాడు. ఇంతలో సివిల్స్ ఫలితాలు రానే వచ్చాయి. వార్తల లో "2006 సివిల్స్ ఫలితాలు. వెలువడ్డాయి...ఎప్పటిలాగానే జాతీయ స్థాయిలో రాష్ట్ర విధ్యార్దులు తమ ప్రతిభ చాటారు. కే. రఘు రామ రెడ్డి అనే ఎం.బి.బి.ఎస్ విద్యార్ది ఈ సారి రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం నిలిచి..జాతీయ స్థాయిలో 49 వ ర్యాంక్ సాదించారు. తను సాధించిన ఈ విజయానికి తన శ్రమతో పాటూ తన తల్లిదండ్రులు. శ్రేయోభిలాషుల ఆశీస్సులే గెలిపించాయని ఆయన తెలిపారు" అని వినగానే రోమాలు నిక్కపొడుచుకున్నాయి..ఏదో తెలియని ఉద్వేగం.నేనే సాధించానన్న ఆనందం. ఏదో తమ కొడుకే సాధించినంత ఆనందం మా ఇంట్లో వాళ్ళకి. డెహ్రాడున్ లో ట్రయినింగ్ పూర్తయ్యింది. అన్నవరం వెళ్దామని వారి కుటుంబం మా కుటుంబం బయలుదేరారట (నేను కేరళలో ఉన్నా అప్పుడు). వారికి నేరుగా గర్భగుడిలోనికి ప్రవేశం లభించదట. వారు భోజనాలు చేస్తున్నంత సేపూ పోలీసులు నిలబడే ఉన్నారట. ఈ విషయాలన్నీ మా అమ్మ గారు నాతో చెబుతూ "చూసావట్రా ఈ భాగ్యం ఎంత మంది తల్లిదండ్రులకు వస్తుంది చెప్పు?. నువ్వు తీసుకెళితే దర్శనం ఏ విధంగా అయ్యేదో ఒక సారి ఊహించుకో!! అన్నయ్య చెప్పినట్టు నువ్వు కూడా సివిల్స్ కి ప్రిపేర్ అవ్వరా....సాధించినా సాధించకపోయినా ప్రయత్నం చెయ్యి అది కాకపోతే ఇంకో పోస్ట్ వస్తుంది. ఏ తల్లిదండ్రులైనా కోరుకునేది ఇంతకన్నా ఏముంటుంది చెప్పు? ఆ కధలూ కవితలూ నీకు తిండి పెట్టవు రా!!" ఒకటే చెప్పాను "ప్రతీ ఒక్కరూ సివిల్స్ సాధించగలిగితే దానికి అంత పేరు వచ్చుండేది కాదమ్మా...అది సాదించడానికి మానసికంగా చాలా ధైర్యం కావాలి. వేటి మీద దృష్టి పెట్టకూడదు. నాకా శక్తి లేదు. నా బుర్ర వేరే వాటి మీద ఉందే అర్ధం చేసుకో ఏదో ఉద్యోగం వెలగ పెడుతున్నాగా ... అందరూ కొడుకులూ ఐ. ఏ.ఎస్. లు ఐ.పి.ఎస్. లు ఐపోతే ఇంకేముంటుంది చెప్పు. గొప్పవాణ్ణవ్వాలని కోరుకోవే!! ఏ రంగమైతే ఏంటి!!. వెళ్ళు నీ గుళ్ళకేవో నువ్వు వెళ్ళి నీ మొక్కులేవొ నువ్వు మొక్కుకో..నా చేతిలో ఏం లేదు" అన్నాను. - నువ్విక మారవు రా. నే చెప్పిన మాట ఏ రోజైనా విన్నావా!!! ఇప్పుడు అతను ఏ.ఎస్.పి గా భద్రాచలంలో చేస్తున్నాడు. మొన్ననే నేను కాకినాడ వెల్తే తను వచ్చాడు. 20 ఏళ్ళగా చూసిన అన్నయ్యే...తను లోనికి వచ్చాడు "అనాలోచితంగా లేచి నిలబడ్డాను. షేక్ హ్యాండ్ ఇచాడు బాగున్నావా అని -- "బాగున్నానండి. మీరెలా ఉన్నారు?" అన్నాను అదే అన్నయ్యను. మనిషిలో మార్పు లేదు ఒక్క "స్థాయిలోనే" మార్పు. అదే నన్ను నుంచునేలా చేసింది..గౌరవించేలా చేసింది. అదీ సివిల్ సర్వీసెస్ కి ఉన్న పవర్. మొన్ననే పుస్తకాలూ అవీ తెప్పించి ప్రిపరేషన్ స్టార్ట్ చేసా. !!!!!!!!
ఈయన నాకు అత్యంత స్పూర్తివంతమైన వ్యక్తులలో ఒకరు. కాకినాడలో మా ఇంటికి ఎదురు గా నివాసముంటున్నారు. నేను పుట్టినప్పటి నుంచీ ఆయన ఈ వ్యాసం రాస్తున్నప్పటి వరకూ ఒకలాగే ఉన్నారు. ఏ మాత్రం మార్పు లేదు. నేను పుట్టక ముందే ఆయన పోలీసు డిపార్టమెంట్ లో ఉద్యొగం చేసి విరమణ చేసారు. అప్పటి నుంచీ ఆ వరండాలో అలా కూర్చుని ఎవరొచ్చినా పలకరిస్తూ ఉంటారు. అతనిలో నాకు నచ్చిన విషయాలకంటే నచ్చనివే ఎక్కువ ఉంటాయి. కాని నాకు అవి అవసరం లేదు. నచ్చేవాటిలో మొదటది..ఏ పని చేసినా నికచ్చిగా చేయడం..ఇక అందులో ఏ లోటు పాట్లు లేకుండా ఏ పొరపాటుకీ తావు లేకుండా..సమయానికి కచ్చితంగా పూర్తి చేయగలగడం. ఈ వయసులో కూడా ఈయన అలానే చేస్తున్నాడు...నాకిప్పటికీ ఆస్చర్యమే అంత కచ్చితత్వ్యం ఎలా వస్తుందో ఆయనకి. 1985 లో మేముంటున్న కాలనీ ఏర్పడింది (మురళీధర్ నగర్) ..అందరూ ఇల్లులు కట్టుకోవడం 1986 కి పూర్తి చేసారు. సరిగ్గా నా వయసు మా ఇంటి వయసు ఒకటే... మా కాలనీ లో అందరం ఒక కుటుంబం లాగా ఉండేవాళ్లం..అందరం ఒకే సారి వచ్చాం కదా..ఈయనే మా కాలనీ లో అందరి ఇంటి ముందూ "కానుగ" చెట్లు నాటించారు...ఇప్పటికీ అవి అలానే ఉన్నాయి..వాటిని చూస్తున్నప్పుడల్లా ఈయన జ్ఞప్తికి వస్తారు..ఎదురింటి వైపు చూస్తానా ...ఆయన మాత్రం నిశ్చలంగా అలా నడుస్తూ పాత జ్ఞాపకాలలో సంచరిస్తూ ఉంటాడు..ఆయన దగ్గరికి వెళ్తే కనీసం 1920 నాటి కబుర్లు చెబుతారు...డచ్ వారు మన కాకినాడకి ఎలా వచ్చారు...ఏ భవనం ఎప్పుడు కట్టారు...ఏ సంవత్సరం లో ఏ ఉపద్రవం వచ్చింది...మనుషుల పోకడలు ఏ విధంగా మారాయి...అప్పట్లో జీవన విధానం ఎలా ఉండేది...అంతా "జిల్లా గ్రంధాలయంలో ఉన్న చరిత్ర పుస్తకాలన్నీ ఒకే సారి చదివినట్టుంటుంది"...ఆయన ఇప్పటికీ స్నేహితులకు ఉత్తరాలు రాస్తారు. ఆ ఉత్తరానికి ఇంకో ఖాళీ ఉత్తరం జత చేసి ఆయన చిరునామా రాసి పంపుతారు..జవాబు వారు వేరే ఉత్తరం కొనే శ్రమ లేకుండా..అది పని కచ్చితత్వం అంటే!!! నాకే స్వయంగా ఇచ్చి ఇది పోస్ట్ చేసి రా నాయనా అంటారు..కనీసం నెలలో ఒక 50 ఉత్తరాలు రాస్తుంటారు. కుటుంబం మీద కాని మనుషుల మీద కాని బంధాల మీద కాని ఆయనకి ఏ విధమైనటువంటి అనుభందమూ ప్రేమా ఆప్యాయత ఇలాంటివి లేవు..తెలిసందల్లా ఒకటే ఏ హాని చేయకుండా ఉండడం..అతనికి లోకం అంతా ఒక్కటే మనవాళ్ళని ,...పరాయి వాళ్ళని భేదం లేదు. అందరినీ ఒకలాగే చూస్తాడు. ఆయన మనవరాల ఎం. బి. బి. ఎస్ చదువుకి ఆయన ఉత్తరాల ద్వారా "డొనేషన్స్" సేకరించడం చూస్తే అద్భుతం అనిపించింది...అయిదు సంవత్సరాలు అలా చేసే ఆ అమ్మాయి చదువు పూర్తి చేయించారు. చాలా మందికి ఆయన నచ్చరు....మరి కొంత మందికి ఆయన ఆదర్శప్రాయుడు..అది చూసే జనాన్ని బట్టి ఉంటుంది..అయినా "రచ్చ గెలవాలంటే ఇంట ఓడాల్సిందే కదా!!!"
నావాళ్ళంటూ నాకు ఎవరూ లేకపోయినా ఫర్వాలేదు నేను బతికేయగలను అని మొట్ట మొదటి సారిగా ఒక వ్యక్తిని చూసి అనుకున్నాను వాడే నా అత్యంత ప్రీతి పాత్రుడు బాల్య మిత్రుడు నా ఆత్మ అన్నీ వాడే....రాజన్ (పచ్చి తెలుగోడు...పేరు మాత్రం తమిళ వాళ్ళ పేరులా ఉంటుంది)
నేను మోహన్ కాన్వెంట్ లో 1996 లో ఆరవ తరగతిలో జాయిన్ అయ్యాను..అక్కడే చూసాను వాడిని మొదటి సారిగా...పొట్టిగా ఉండేవాడు..భళే చురుకుగా ఉండేవాడు...బాగా చదువుతాడు అని పేరు కూడా ఉండేది..అలాగే ఆటల్లో కూడా ఉత్సాహంగా పాల్గొనేవాడు..కాబట్టి అందరకీ అందుబాటులో ఉండేవాడు. నేను కూడా బాగా ఆకర్షితుడినయ్యాను. ఏడవ తరగతిలో మా ఇద్దరికీ బాగా పరిచయం ఏర్పడింది...నేను వాడి స్నేహం కోసం బాగా ప్రాకులాడేవాడిని..వాడు ప్రతీ విషయాన్ని చాలా తేలికగా తీసుకునే వాడు..మనుషుల గురించి ఆలోచించేవాడే కాదు...ఏదో వాడి బతుకు వాడు బతికేసేవాడు..వాడి చదువు వాడు చదివేసేవాడు...అంతే బాగా బద్దకం కూడా ..మనుషుల్ని పట్టించుకునేవాడు కాదు..అయినా అందరికీ స్నేహితుడే వాడు. బాధలు కష్టాలు ఇవేం వాడికి తెలీవు...వాడు పెరిగిన వాతావరణం అలాంటిది మరి!! నాకు వాడికి చాలా ఆంతర్యం ఉంది ఈ విషయంలో ఇలాగే మా స్నేహం కొనసాగింది ..నేనే వాడి గురించి ఎక్కువగా పట్టించుకునే వాడిని..వాడు నా గురించి అసలు ఆలోచించేవాడే కాదు. నేను చాలా బాధపడేవాడిని. చెబుదామనుకుంటే వాడు వినిపించుకునేవాడే కాదు..లోలోనే మధనపడేవాడిని. నేనే వాడిని సైకిల్ ఎక్కించుకుని తెల్లవారు జామున ప్రైవాటుకి తీసుకెళ్ళేవాడిని ..లేకపోతే వాడు రాను అనేవాడు..నాకు ఒక్కణ్ణే వెళ్ళడం ఇష్టం ఉండేది కాదు ఇలాగే కొనసాగింది ఇంటర్మీడియట్ (2003) వరకు..ఆ తరువాత నేను కాకినాడ లోనే దిగ్రీ కాలేజి లో జాయిన్ అయ్యాను..వాడు బాపట్ల ఇంజినీరింగ్ కాలేజిలో జాయి అయ్యాడు....అప్పుడు తెలిసొచ్చిందనుకుంట వాడికి మనుషులు ..లోకం అంటూ కొన్ని తెలుసుకోవాల్సినవి ఉన్నాయని...మేము ఎప్పుడు కలుసుకున్నా పార్క్ కి వెళ్ళేవాళ్ళం ఒక సారి వచ్చి..నా గురించి నీ అభిప్రాయం ఏంట్రా ..నన్ను ఒక్కొక్కరూ ఒక్కక్కలా చూస్తున్నారు ఒక్కో అభిప్రాయం చెబుతున్నారు..నా గురించి నువ్వేమనుకుంటున్నావ్ అని అడిగాడు...అదే మొట్ట మొదటి సారిగా మేము మనసు విప్పి మాట్లాడుకున్న రోజు...ఆ తర్వాత రోజు నేను ఒక ఉత్తరం రాసి వాడిని ఇంటికెళ్ళాక చదువుకొమన్నాను. వాడు దాన్ని చదివి కంటతడి పెట్టుకున్నాడు ..అప్పటి నుంచే అసలు స్నేహం మొదలైంది మా మద్య...అప్పటి వరకూ నేను వాడి భారం మోసా అప్పటి నుంచీ వాడు నా భారం మోస్తూనే ఉన్నాడు..."మరి నీ ఋనం తీర్చుకోవద్దా" అని అంటాడు..నీ ఋనం ఈ పాటికే తీరిపోయి ఉంటుంది ఇంకా లెక్క చూస్తే మళ్ళీ నేనే ఋనపడిపోయి ఉంటాను. ఇప్పుడు కూడా ఇద్దరం మద్రాసు లోనే ఉంటున్నాం. పాపం వాడే నా బాగోగులు అన్నీ చూస్తున్నాడు..ఇక్కడ పూర్తిగా నేను వాడి మీద ఆధారపడిపోయా..నా పని ఉన్నా వాడి పని ఉన్నా వాడినే పిలుస్తున్నా !! ఎప్పుడూ అనుకుంటుంటాం "ఒరేయ్ మనం ఒకే చోట ఇల్లు కట్టుకుని ఉందాం ..చక్కగా నచ్చిన వాళ్ళని పెళ్ళి చేసుకుని జీవితంలో ఏ లోటూ లేకుండా ఒకే కుటుంబంగా ఉందాం ..ఈ జన్మకి ఇలా గడిపేద్దాం" అని అనుకుంటూ ఉంటాం. రోజుకి కనీసం ఒక ఐదారు సార్లైనా ఫోన్ మాట్లాడుకుంటాం ఏం చిన్నది జరిగినా చెప్పేసుకోవాలి. నేను కవితలు, పాటలు రాయడానికి ప్రేరణ వాడే..కానీ ఏనాడు నీ రచనలు బాగున్నాయి రా అని వాడి చేత అనిపించుకోలేకపోయాను...ఏనాడైనా వాడి చేత అనిపించుకోవాలనే తాపత్రయం తోనే రాస్తున్నా....ఈ జన్మకి వీడే నా అత్యంత ప్రీతిపాత్రమైన స్నేహితుడు ..ఈ స్థానాన్ని ఎవరూ ఆక్రమించుకోలేరు!!
ఇప్పటి జీవితాలలో వేగం పెరిగింది కాని ఓపిక ఓర్పు బాగా తగ్గిపొయాయండి..ఏమంటారు !!! మన గురించి పట్టిణుకోడానికి వీలులేని ప్రణాలికలైపోయాయి ...మొన్న మా అమ్మ గారు ఇల్లు చక్కపెడుతుంటే ..ఏవో చిన్నప్పటి పుస్తకాలు సర్దుతున్నాను...ఒక పుస్తకంలోంచి నెమలీక జారి పడింది...అంతే!! ఒక్కసారిగా 1994 లోకి తొంగి చూసా...అప్పుడు నా మానసిక స్థితి ..నేను పెరిగిన వాతావరణం ..కలిసి తిరిగిన స్నేహితులు అందరూ కళ్ళముందు కనిపించారు ..అప్పుడే అనుకున్నా మనం కలిసి తిరిగిన మనుషుల్నే మర్చిపోయానా ఇన్ని సంవత్సరాలనుంచీ అని కొంత విచారంతో...!! మీ జీవితంలో మరచిపోలేని మనుషులను ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకోగలరా !! ఇది కూడా ఓ పెద్ద విషయమే ఇప్పుడు!!
నేను మొదటగా చెప్పాలంటే నా చిన్నప్పటి స్నేహితురాలు గురించే కచ్చితంగా చెప్పాలి!! తన పేరు దీప్తి ...దీపు అని పిలిచే వారు లెండి అంతా...ఏదో జనాల అభిమానం కొద్దీ నన్ను బాబి అని పిలుస్తుంటారు. నేను నా జీవితంలో ఏ వ్యక్తితోనైనా ఇప్పటి వరకు కలిసి పెరిగాను అంటే అది దీప్తి తోనే సుమారు మూడేళ్ళ వయసు (1989) ఉన్నప్పటి నుంచీ ఒకరికొకరు తెలుసు....సుమారు 2000 వరకు కలిసే పెరిగాం...కాని ఒకటే లోటు...నా గురించి తనకి కాని..ఆమె గురించి నాకు గాని లీల మాత్రంగా అయినా ఏం తెలీదు...గుడ్డి స్నేహం మరి!!! ఎప్పుడూ ఒకరి అభిరుచులు గాని ఒకరి అభిప్రాయాలు కాని చెప్పుకోలేదు..పంచుకోలేదు.....అయినా ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుకుంటూనే ఉండేవాళ్ళం...ప్రపంచం గురించి..సమాజం గురించి కూడా శిఖరాగ్ర చర్చలు జరిగేవి అప్పట్లోనే !!!...ఏదో ఒక నెపం తో నేను వాళ్ళింటికి కాని తను మా ఇంటికి కానీ వెల్తూ వస్తూ ఉండేవాళ్ళం. తనే ఎక్కువగా మా ఇంటికొస్తూ ఉండేది...మా ఇంట్లో సందడి గా ఉంటుందని...మా అన్నయ్య అక్క కూడా ఉంటారు గా అందుకని...కాస్త స్వేచ్చ కూడా ఎక్కువే అందుకని!! వాళ్ళది కలర్ టీ.వీ పైగా కేబుల్ కనెక్షన్ కూడా ఉండేది...మాది చిన్న బ్లాక్ & వైట్ వితౌట్ కేబుల్ కనెక్షన్ !!! నేనేమో వాళ్ళింటికెల్లి టీ.వీ చూడాలనుకొనేవాడిని..తనేమో మా ఇంటికొస్తాననేది ఇలాగే చచ్చేవాళ్ళం...ఎప్పుడూ ఒక ఆట కాని ఒక పాట కాని ఏం లేదు అలా ఇద్దరం వంటరిగా కూర్చొనేవాళ్ళం శూన్యం వైపు ధీర్గంగా చూస్తూ ఏవో కబుర్లు చెప్పుకునేవాళ్ళం. అప్పుడప్పుడూ పువ్వులు కోసి మేడ మీద నుంచి కిందకు జారవిడిచి "అవి మట్టిలొ పడితె వచ్చె జన్మలో మనుషులుగా పుడతాయి...లెకపొతె నీటిలో పడితే చేపలు గా పుడతాయి" అని అనుకునే విసిరేవాళ్ళం...ఇంతే నా బాల్యం అంతా అలా అమాయక స్నేహం లోనే గడిచిపోయింది..కాని అదే సమయంలో ఎంతో తెలుసుకున్నాను ప్రపంచం గురించి ...మనుషుల విలువలు గురించి, సేవా తత్వం గురించి ఆశావాదం గురించి అంతా ఆ అమాయక స్నేహం లోనే తెలుసుకున్నాను !!! ఇప్పటికీ మా ఊరెళ్ళినప్పుడు చిరునవ్వే మా పలకరింపు...ఎప్పటికీ "పసి"వాడని స్నేహం
ఈ రోజు మనకోసం ఒక మంచి ఏర్పాటు చేసా....కుర్చీలు వేయించేసా...ఇప్పుడు హాయిగా ఉందికదండి...ఆ ఈ కాఫీ తీసుకొండి ..చల్లారిపోతుంది...ఆ భళే వారే దానిదేముంది లెండి..ఏం మొన్న మీ ఇంటికొస్తే మీ ఆతిధ్యం మేము స్వీకరించలేదా ఏం...ఆ ఆ ఆమొక్కేనా రెండు నెలల క్రితం మీ చేతులతో నాటించి నీరు పొయించిన మొక్కే...చూసారా అప్పుడే ఎంతగా ఎదిగిందో..ఆ పువ్వులు చూడండి గుబురుగా ఎలా విరగ పూసాయో!!!..అంతా ప్రకృతి సృష్టే..ఔను మొన్న మీకేదో చెబుతూ మద్యలో ఆపేసాను చీకటి పడిందని ఏమిటది...? ఆ ఆ అదే మా అన్నగారి సమయస్పూర్తి గురించి కదా...చెబుతా ...
నేను ఏడవ తరగతి చదువుతున్నాను (పన్నెండేళ్ళ క్రితం మాట లెండి). సాయంత్రం ఇంటికొచ్చాక కాసేపు మా వీధిలొనే (వీధి దాటి వెళ్ళకుండా )పెద్ద సైకిల్ తొక్కుకునేవాడిని. ప్రతి రోజులాగానే ఆ రోజు కూడా తొక్కుకుంటుంటే. మా స్కూల్ లో నాతో పాటూ చదివే స్నేహితుడు కనిపించాడు. ఒరెయ్ మనం పార్క్ కి వెల్లి ఆడుకుందామా అన్నాడు. 2 కిలోమీటర్లు దూరం అంతే అన్నాడు. ముందు నేను అమ్మో భయం నేను అంత దూరం రాను. మా అమ్మ కొడుతుంది అంటే చెబితే కదరా తెలిసేది. కాస్త ఐదు నిముషాలు ఆడుకుని వచ్చేద్దాం చాలా బాగుంటుంది అన్నాడు. పార్క్ కదా (మనం ఎప్పుడూ వెళ్ళలేదులెండి) అని సరదా పడి వెళ్ళాను. సైకిల్ అక్కడ పెట్టి తాళం వేసి ఆడుకొవడం మొదలుపెట్టాను. అసలే నాకు భయం కదా..తాళం అస్తమానం చూసుకునే వాణ్ణి ఉందో లేదో అని. వాడు అది గమనించి ఒరెయ్ నేను ఒక ఉపాయం చెబుతాను అలా చేస్తే తాళం ఎక్కడా పడిపోదు అని చెప్పి. బొత్తానికి మధ్యలో అది పెట్టి బొత్తం చొక్కాకు పెట్టాడు (అది చాలా తెలివైన ఉపాయం). సరే అలానే పెట్టుకున్నాను. అయినా అనుమానం చాలా భయంకర్మైంది. పడిపోతుందేమొనని అనుకుని మళ్ళీ తీసేసి జేబులో పెట్టుకున్ని. ఏడు పెంకులు ఆట ఆడుకుంటున్నాను. బాల్ ని గురి చూసి కొట్టా...పెంకులు పగిలాయి. పరిగెడుతూ నా జేబు తడుంకున్నాను. తాళం కనపడలేదు. అప్పుడు నా గుండె పగిలింది. వెంటనే ఆట ఆపేసి వెదకడం మొదలుపెట్టాం. పొవడం అంటే తేలిక గాని దొరకడం కష్టం కదా...దొరకలేదు. సమయం కాలం మీద స్వారీ చేస్తుంది. సూర్యుడు బట్టలు సర్దుకుంటున్నాడు వలస వెళ్ళడానికి. నా గుండె నెలలు నిండిన చూలాలు లాగా కొట్టుకుంటొంది. వాడు వెళ్ళిపోతాను టైం అయిపొయింది హోం వర్క్ లు చేసుకోవాలి అన్నాడు. నాకు తెలియని హోం వర్క్ లు ఏమున్నాయి రా..కాసేపు వెదక రా అన్నాను. మా నాన్న తంతాడు అన్నాడు. మరి నన్ను ఎందుకు తీసుకొచ్చావ్ ఇక్కడికి. మా నాన్న మాత్రం ముద్దెట్టుకుంటాడా?. కాసేపు వెదుకు అన్నాను. వాడన్నాడు మా ఇంట్లొ ఒక తాళం ఉంది రా అది పనికొస్తదేమో తేనా అని ఊరించాడు. సరే తే అన్నాను...సరే అని చెప్పి వెళ్ళిపొయాడు...వాడు ఇప్పటికీ ఆ తాళం తేలేదు అనుకొండి..అప్పుడు అర్ధమయింది మన వాడు. పలాయనం చిత్తగించాడు అని. ఇక చూద్దురు కదా నా కష్టం. అసలే పెద్ద సైకిలొకటి. చీకటి. ఐదు నిముషాలే కదా అని ఐదు గంటలకు బయలుదేరా. ఏడు అయ్యింది..సైకిల్ ను ఈడ్చుకుంటూ ...ఏడ్చుకుంటూ వచ్చాను.వచ్చే సరికి ఇంటి వాకిలి ముందు విజయుడై తిరిగొస్తున్న వీరుడికి ఆహ్వానం పలకడానికి నుంచున్నట్లు నుంచున్నారు మా అక్క అన్నయ్య. వాళ్ళకు చాలా ఆనందంగా ఉందనుకొండి నన్ను తన్నించడానికి. అన్నీ తెలుసుకుని నాకివ్వాల్సినవి ఇచ్చేసారు. పెట్టాల్సినవి అన్నీ లాంచన ప్రాయంగా పెట్టేసారు. అప్పుడు మా అన్నయ్య నా దగ్గరకొచ్చి...ఏరా 2 కి.మీ సైకిల్ ని ఈద్చుకుంటూ వచ్చావా...ఇదే పరిస్తితి నాకు ఒకటవ తరగతిలొ ఎదురైంది..నేనేం చేసానొ తెలుసు..రిక్షా ఒకటి మాట్లాడి అందులో వేసి వచ్చేసా...అన్నాడు..మరి డబ్బులు ఎక్కడివి అని ముక్కు చీదుకుంటూ అడిగా...అప్పుడు మా అన్నయ్య...పిచ్చి వెధవ నాకెక్కడివి డబ్బులు ఇంటికొచ్చాకా మా అమ్మ ని అడిగి ఇప్పిస్తా అన్నాను. పడాల్సిన దెబ్బలు ఎలాగూ పడతాయి. కాస్త రిక్షా లొ వచ్చాను అంతే తేడా అన్నాడు నవ్వుతూ....అప్పుడర్ధమైంది "సమయస్ఫూర్తి" అంటే ఏమిటో.....
ఔనూ మొన్న ఆఫీసు కి రాలేదు మీరు..ఆ సాయంత్రం మీకోసం ఇక్కడ చాలాసేపు ఎదురుచూసాను...ఎవరో స్నేహితునికి బాగొలేదంటే మీ ఊరెళ్ళి వచ్చారని తెలిసింది...ఇప్పుడు ఎలా ఉంది ఆయనకి!! ... మీ బాల్య మిత్రుడటగా...ఏంటీ ఈ చెట్టుకి పూసిన పువ్వులేమైనవి అని అడుగుతున్నారా..!! ఏం లేదండి నిన్న మా పక్కనున్న వాళ్ళింటికి చుట్టాలు వస్తేను మా అమ్మ గారు కోసి ఇచ్చారు....అయినా ఈ రోజుల్లో స్నేహాలకి సమయం ఎక్కడుంది చెప్పండి, అవసరం వస్తే తప్ప కానీ...ఏం అనుకొకండి ఇలా అంటున్నాని ..అసలు సఖ్యత గల స్నేహాలు లేవని కాదు...అరుదని ...
నాకు బాల్యం నుంచీ ఒక స్నేహితరాలు ఉంది...సరిగ్గా చెప్పాలంటే మాకు మూడేళ్ళ వయసు ఉన్నప్పటి నుంచీ (ఊహ తెలిసినప్పటి నుంచి అంటే బాగుంటదేమో) మా మద్య స్నేహం మొదలైంది .... అది మాతో పాటు పెరిగి పెద్దదై స్నేహంగానే కొనసాగింది....నేను ఇంటర్మీడీఎట్ లో ఉండగా వారు మా పక్కిల్లు ఖాలీ చేసి వెళ్ళిపోయారు...వేరే వీధిలోకి...ఒక సారి మా వీధిలో ఎవరిదో గృహప్రవేశానికి మామ్మల్ని వాళ్ళని కూడా ఆహ్వానించారు. అప్పుడు నేను డిగ్రీ చదువుతున్నాను..చాలా నెలలు తర్వాత కనపడింది కదా అని భొజనం చేసి ఐస్ క్రీం తింటూ ఒక చోట కూర్చుని మాట్లాడుకుంటున్నాం..ఇంతలో ఒకావిడ (కిళ్ళీ నములుతూ) ఈ వేడుక జరుపుతున్న వాళ్ళతో మాకు వినబడేట్టు అంటుంది "ఎవరండీ వారిద్దరూ అలా బహిరంగంగా బిడియం లేకుండగా అలా గంటలు గంటలు మాట్లాడుకుంటున్నారు" అని. అప్పుడు మేమిద్దరం కాస్త అసౌకర్యానికి లోనయ్యాం..ఈవిడేంటి వాళ్ళని అలా అడిగేసింది. ఇప్పుడు పాపం వాళ్ళేం చెబుతారు అని భయం తొ చూస్తున్నాం. అప్పుడు ఆవిడ వచ్చి అడిగిన ఆవిడితో "వాళ్ళు ఈ వీధిలోనే ఉంటున్నారండీ....చిన్నప్పటి నుంచీ మంచి స్నేహితులు. ఈ వీధిలో ప్రతీ ఒక్కరికీ తెలుసు వీరి గురించి అందుకే వాళ్ళు అలా మాట్లాడుకుంటున్నారు. వీరి గురించి చెప్పాలంటే మాటల్లో కుదరదండి ఒక పుస్తకమే రాయాలి". అని అన్నారు. అప్పుడు మేమిద్దరం చాలా ఆనందించాం. మా సాన్నిహిత్యం, స్నేహం ఇంత గొప్పదైందా అని గ్రహించాం. అది ఈ రోజులలో పుట్టే స్నేహం మద్య ఉంటుందా ఆ సఖ్యత అని అనుమానం కూడా కలుగుతుంది.
ఒహ్ ..ఎక్కడ కూర్చోడానికి వీలులేకుండా ఉందే తోటంతా చిత్తడిగా ఉంది..వర్షం పడిందిగా ..ఫర్వాలేదులెండి కాస్త అలా నడుద్దాం...ఆ రోజు మీరు చెప్పిన జోక్ ఇంకా నవ్వు తెప్పిస్తుందనుకొండి ..ఈ కాలం పిల్లలు అంతేనండి మహా తెలివిగల వాళ్ళు..చాలా చాకచక్యంగా చెసెస్తున్నారు అల్లరి..మొన్న మీరీ విషయం చెబితే నా చిన్ననాటి జ్ఞాపకం ఒకటి తటస్తించింది ...మా మావయ్య వాళ్ళబ్బాయ్ లెండి..
వాడి పేరు ఫణి దీప్. నన్ను బాబి అని పిలుస్తుంటాడు. నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నప్పుడు వాడు నాలుగవ తరగతి చదువుతున్నాడు. వాళ్ళది విజయనగరం అక్కడ సరిగ్గా చదవటం లేదు. నీ దగ్గరైతే నిన్ను చూసి చదువుకుంటాడు. నువ్వు చదువుతున్న స్కూల్ లోనే జాయిన్ చేస్తాను అని చెప్పి వాణ్ణి కాకినాడ తీసుకొచ్చాడు మా ఇంటికి. సరే వాడు కూడా మా స్కూల్ లోనే జాయిన్ అయ్యాడు. వెల్తున్నాం వస్తున్నాం. అప్పుడప్పుడూ చదవకపోతే మా అన్నయ్య వాణ్ణి నాలుగు వాయించేవాడు. నేను కొట్టే వాణ్ణి కాదనుకోండి.. ఒక రోజు మా అక్క మా అన్నయ్య ఇద్దరూ వాడి మీద దండెత్తారు సరిగ్గా చదవడం లేదని. ఇక చూసుకోండి వాడికి రోషం పొడుచుకొచ్చింది. వెంటనే కిరాణా కొట్టుకి వెల్లి ఒక పోస్ట్ కార్డ్ కొని తెచ్చి..వాళ్ళ నాన్న కి ఉత్తరం రాసాడు. వాడు చదివేదు అప్పుడు నాలుగో తరగతి. ఉత్తురం ఈ కింది విధంగా రాసాడు.
పూజ్యునీయులైన నాన్న గారికి,
మీ కొడుకు ఫణి నమస్కరించి వ్రాయునది.
ఇక్కడ నేను తప్ప అంతా క్షేమమే. నన్ను బాబి రోజూ స్కూల్ కి తీసుకు వెల్తున్నాడు. మేమిద్దరం బాగానే చదువుతున్నాము, ఆడుకుంటున్నాము. గొడవలు పెట్టుకోవడం లేదు. ఇక్కడ అన్నయ్య అక్క ఇద్దరూ నన్ను కొడుతున్నారు. అత్త బాగానే చూసుకుంటుంది. ఇంకా మీ ఆరోగ్యం , అమ్మ ఆరోగ్యం ఎలా ఉంది. చెల్లి ఆడుకుంటుంది కదా. అమ్మకి నా నమస్కారాలు. చెల్లి కి నా ముద్దులు.
ఇట్లు మీ ఎదవ
ఫణి.
ఈ ఉత్తరం రాసాడు పాపం వాడు. కాని దాన్ని ఎక్కడ పోస్ట్ చెయ్యాలొ తెలీక. దాన్ని వాడు వాడి దగ్గరే దాచుకున్నాడు. ఒక రోజు వాళ్ళ నాన్న గారు చూడడానికి వచ్చారు. అప్పుడిచ్చాడు ఆ ఉత్తరం. అది చదివి..ఒకటే నవ్వు. చూడు అంత చిన్న వయస్సులో మీరెవరైనా అంత పరిపక్వత తో ఉత్తరం రాయగలిగారా అని మమ్మల్ని అన్నారు. ఆ ఉత్తరం ఇంకా మా ఆల్బం లో పదిలంగా ఉంది. ఇప్పుడు వాడు బి. ఫార్మసి చదువుతున్నాడు. ఇలాంటి జ్ఞాపకాలు మాకు ఎదురవడం నిజంగా చేసుకున్న పుణ్యమే....ఆ ఉత్తరాన్ని తడుముకుంటే ఆ రోజులు ప్రత్యక్షమౌతాయి కళ్ళముందుకు.
ఏమిటీ!! ఈ రోజు మన తోటకి కాస్త కళ తగ్గిందా ...బహుసా వాతావరణం లో మార్పు వళ్ళ అయ్యుండచ్చు...ఈ రోజు ఆఫీసు కి వెళ్ళారా!! నేను వెళ్ళలేదండి ..ఆ ఏం లేదు వంట్లో కాస్త నీరసంగా ఉంటేనూ....రండి ఇలా ఇక్కడ కూర్చుందాం...ఇదా సన్నజాజి తీగ మొన్నే వేసా మీకు చెప్పలేదా !!...మా ఇంట్లొ ఒకటే గొడవనుకొండి సన్నజాజి తీగ వేయమని వారి పోరు భరించలేకే చోటు లేకపోయినా ఇలా ఇక్కడ వేసాను..
ప్రతీ రాత్రీ పున్నమి రాత్రి కాదన్నట్టు..మన లైఫ్ లో కూసిన్ని సిగ్గుపడాల్సిన సంఘటణలు కూడా ఉన్నాయి. అందులో ఎన్నిక గన్నవి...మన్నిక గన్నివి ఈ కింద చెబుతున్నా....
నా చిన్నప్పుడు ఒక బాల్య మిత్రురాలు ఉండేది నాకు. వాళ్ళమ్మగారికి నా మీద అపారమైన నమ్మకం. నేనన్నీ మంచి పనులు చేస్తానని ... మంచి నడవడిక కలిగిన వాణ్ణని అనుకునేవారావిడ. ఆ విషయమే ఆ అమ్మాయికీ ఎప్పుడూ చెబుతూ ఆ అబ్బాయిని చూసి నేర్చుకోవే అని తిడుతుండేవారు. ఒక రోజు ఆదివారం నేను వాళ్ళింట్లొ ఆడుకుంటుంటే ఆవిడ బాబూ ఈ రోజు మా ఇంట్లొ భొజనం చెయ్యి..మా అమ్మాయి అన్నం చాలా లేట్ గా తింటదమ్మా..నిన్ను చూసైనా నేర్చుకుంటది అందుకని నువ్వు ఈ రోజు మా ఇంట్లొ భొజనం చెయ్యి అన్నారు. నేను మామూలుగా భొజనం వేగం గానే తింటాను. కాకపోతే చేపలు కూర నాకు ఇష్టం ఉండదు..ఆ రోజు ఆవిడ నాకదే వేసి పెట్టింది. ఇక చూడాలి నా పాట్లు...ఇద్దరం భొజనం ముందు కూర్చున్నాం..చేపల కూర ఒక వైపు...సరే పౌరుషం థొ వేసుకున్నా కూర..కాకపోతే చాలా కారంగా ఉంది. ముద్ద నోట్లోకి వెళ్ళటం లేదు. ఆవిడ నా అవస్త చూసి బాబూ కాస్త నెయ్య వేసుకుంటే బాగుంటుంది అని వేసింది..ఇక నా కష్టాలు రెట్టింపయ్యాయి. ఇకారం మొదలైంది ......చివరికి నేను ఆ అమ్మాయికన్నా 20 నిముషాలు లేట్ గా తిన్నాను. అది కూడా పూర్తి చెయ్యలేదు...పూర్తికాకుండానే కంచం తీసేసారు...ఆ రోజు నా మొహం ఎక్కడ పెట్టుకోవాలొ అర్ధం కాలేదు...ఇప్పటికీ అది తలచుకుంటే భలే నవ్వొస్తుంది. ఇలాంటిదే మరో సారి జరిగింది....నేను ఒక రొజు మధ్యాహ్నం పళ్ళు తోముకుంటున్నాను..ఆవిడ చూసి మా అమ్మగారితో అన్నారు. మీ అబ్బాయి నయం అండి మధ్యాహ్నం భొజనం చేసాక కూడా బ్రష్ చేస్తున్నాడు మా అమ్మాయి పొద్దున్న కడగడానికే బాధ పడిపోతది అన్నారు..అప్పుడు చెప్పారు మా అమ్మ గారు నిజం. మా అబ్బాయి పొద్దున్న కడగలేదండి..ఇప్పుడే లేచాడు వెధవ...భొజనం చెయ్యడానికి పళ్ళు తోముకుంటున్నాడు అని.....మరో మాయని మచ్చ.
జాగ్రత్త కొమ్మలు తగులుతున్నాయా!! ఈ చెట్టు కాయలు చాలా బాగుంటాయండొయ్...మీరెప్పుడూ రుచి చూడలేదా మా చెట్టు జామకాయలు..భళే వారే..ఇదిగో ఇది తిని చెప్పండి ఎలా ఉందో...
తినడం అంటే గుర్తొచ్చింది ...మనకి(నేను) చిన్నప్పుడు తిండంటే కాస్త కక్కుర్తి ఎక్కువే ... అందులోనూ మా అక్కవి అన్నయ్యవి అంటే మరీనూ... ఒక సారి అలాగే మా ముగ్గురికి ఎగ్జిబిషన్ లొ పెద్ద పెద్ద చాక్లెట్లు కొనిచ్చారు మా నాన్న...ఇంటికొచ్చేసరికి నేను మా అన్నయ్య తినేసాం. మా అక్క తర్వాత తిందాం అని చెప్పి తినకుండా ఇంటికి తెచ్చుకుంది. తను స్నానం చేసి వచ్చేలొపు అది తినేద్దాం అన్న ఆలోచనతో ఆ చాక్లెట్ని మా అక్క స్నానానికి వెళ్ళినప్పుడు దొంగలించి తింటున్నా...ఈ లొపులో స్నానం చేసి తిరిగొస్తున్న మా అక్కను చూసి ఈ చాక్లెట్ని ఏం చెయ్యాలొ తెలీక మా అన్నయ్య బ్యాగ్ లొ పెట్టేసా......మా అక్క మా ఇద్దరి మీదా అనుమానంతో బ్యాగ్ లు చెఖ్ చేయడం మొదలుపెట్టింది...చూద్దురు కదా అది మా అన్నయ్య బ్యాగ్ లొ దొరికింది. ఇక మా అన్నయ్యకి ఫుల్ల్ బ్యాండ్ పడింది మా అమ్మగారి చేతిలో...దీనితో కోపం తో మరొక్క సారి మా అన్నయ్య అచ్చు అలానే మా అక్క చాక్లెట్ దొంగలించి నా బ్యాగ్ లో పెట్టాడు...ఈ సారి మా అక్క బ్యాగ్ లు చెఖ్ చెయ్యకుండా మా అమ్మ చేత మా అన్నయ్యను చితక తన్నించింది .. మా అన్నయ్య కోపం తో కావలిస్తే వాడి బ్యాగ్ చెక్ చెయ్యండి అన్నాడు...నీకెలా తెలుసురా వాడి బ్యాగ్ లొ ఉన్నట్టు అంటే నువ్వే తమ్ముడి బ్యాగ్ లొ పెట్టావా అని చెప్పి మళ్ళీ బజంత్రీలు మొగించారు. పాపం ఎటు తిప్పినా మా అన్నయ్యకే పడ్డాయి తన్నులు....మరి బాల్యంలో మన ఆగడాలు అన్నీ ఇన్నీనా.....
ఏంటి ఈ రోజు తొందరగానే విచ్చేసారి మా తోటకి...!!! సరే అలా కాస్త నడుస్తూ కబుర్లు చెప్పుకుందాం ...ఆ ఆ కంగారేం పడకండి ముళ్ళులేం ఉండవ్ ఇక్కడ అన్నీ పువ్వులే...
మీకింకో అనుభవం చెబుతా ఈ సాయంత్రం..!!హం ..ఇది కూడా మర్చిపొలేని అనుభవమే...ఎప్పుడు జరిగిందొ గుర్తులేదు...కానీ వేసవి సెలవులు అవి...మా అన్నయ్య మంచి ఎలక్ట్రీషీయన్ తను ఏదొ పాడైపొయిన బల్బ్ ని వెలిగించ ప్రయత్నం చెస్తున్నాడు. ఆ ప్రయత్నం ఫలించింది బల్బ్ వెలిగింది..ఇక ఆ తరువాతా ఒక రెండు ఎలక్ట్రిక్ వైర్లని తీసుకుని ఒక చీమకి తగిలిస్తున్నాడు దానికి షాక్ తగలి గిర గిర తిరుగుతుంది..ఇదేదొ బాగుంది కదా అని మా అన్నయ్య చూడకుండా నేను కూడా ఆ వైర్లని తీసుకుని ఆ చీమకి షాక్ పెడుతున్నాను...అది అదృస్టవశాత్తు నా వేలికి తగిలింది ఒక వైరు..అంతే ఆ చీమ గిర గిర తిరగాల్సిన స్తానం లొ నేను తిరుగుతూ తిరుగుతూ వెళ్ళి బక్కెట్ లొ పడ్డా...పుండు మీద కారం చల్లినట్లు ఇంకా గట్టిగా షాక్ కొట్టింది..బల్బ్ పగిలింది (నా తలకాయ లాగ)...పడుకున్న మా అమ్మ వచ్చి మా అన్నయ్యను తన్నింది (చిన్న పిల్లల ముందు ఆ పనులు ఎందుకు పెట్టావ్ అని)...అప్పుడు అర్ధమయింది "చెరచకు రా చెడేవు" అన్న సామెతకు అర్ధం..(చీమని చెరిచా...నేను చెడాను)...
పరీక్షలంటే అంటే గుర్తొచ్చింది..నాకు చిన్నప్పుడు ఎప్పుడూ పరీక్షల సమయంలో రాత్రుళ్ళు కలలొచ్చేవి (ఎక్కువగా పడుకుంటే కలలే వస్తాయి) ... ఒక సబ్జెక్ట్ కి ప్రిపేర్ కాకుండా ఇంకొ సబ్జెక్ట్ కి ప్రిపేర్ కావడం..వేరే సబ్జెక్ట్ ఎగ్జాం పెట్టడం...ఎగ్జాం పొద్దున్న అయితే మధ్యాహ్నం అనుకొవడం...ఇవ్వాల్టినుంచి ఎగ్జాంస్ అయితే రేపటి నుంచి అనుకొవడం..హాల్ టికెట్ మర్చిపొవడం..ఇలాంటి హర్రర్ కలలన్నమాట...ఎప్పట్లాగే అప్పుడు కూడా (ఏ తరగతో సరిగ్గా గుర్తులేదు 5 లేదా 6) కలవచ్చింది...అప్పుడు ఇంట్లొ వాళ్ళు ముఖ్యంగా హాజరు కావాల్సిన పెళ్ళికి వెళ్ళారు (యూనిట్ ఎగ్జాంస్ లెండి..అందువల్ల పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వలేదు ఇంట్లొ వాళ్ళు)..మా అక్క ఒక్కత్తే ఉంది. ఎగ్జాం 8 కి అయితే నేను 9 కి వెల్లినట్టు ...లేట్ అయినందుకు నన్ను పరీక్ష రాయనివ్వకుండా ఇంట్లొ వాళ్ళని పిలుచుకు రమ్మనట్టు కలవచ్చింది. వెంటనే లేచి కూర్చున్నాను. టైం చూసానా ..అప్పటికే 8-30 అయ్యింది. మా అక్క అప్పటికి ఇంకా లేవలేదు !!!. కలలో ఏదైతే జరిగిందో అదే జరిగింది. మర్నాడు బాజా బజంత్రీలతో నన్ను మా నాన్నగారు స్కూల్ కి తీసుకెళ్ళి అక్కడ ఇంకో రౌండ్ వార్నింగ్ ఇచ్చి మర్యాదగా పరీక్ష రాయించి ఇంటికి తీసుకొచ్చారు. అప్పట్నుంచీ కలలు రాకుండా రాత్రుళ్ళు చదవడం నేర్చుకున్నా..!!!!!
నేను ఆరవ తరగతి చదువుతున్నప్పుడు సంగతి..ఒక రోజు నేను స్కూల్ నుంచి ఇంటికొచ్చే సమయానికి మా ఇంట్లో వాళ్ళు గుడికి సిద్దమయ్యారు. ఆ రోజు మా స్కూల్ లొ ఏవో పరీక్షల తాలూకు ఫలితాలు వచ్చాయి.ఆ విషయం తెలిసి మా అమ్మగారు అడిగారు. మార్కులు ఎలా వచ్చాయిరా అని....నేను భయంతో ముందు బాగా వచ్చాయి అమ్మా అని అన్నాను. దానికి మా అమ్మ గారు అంతా దైవేచ్చ రా!! రా నువ్వు కూడా గుడికి అన్నారు. అప్పుడు కొంత కోలుకుని ఒక సబ్జెక్ట్ లో ఫైల్ అయ్యాను అన్నాను. అప్పుడు మా అమ్మ గారు కోపంతో నన్ను తిట్టడం మొదలుపెట్టారు అప్పుడు నేను కాస్త ఉక్రోషంతో ఇది కూడా దైవేచ్చే...ఏం నేను బాగా చదివితే అది దైవేచ్చ...లేకపోతే నా తప్పా? అని ప్రశ్నించా....అలా అన్నాక కోపంతో చితక్కొట్టడం మొదలు పెట్టారు....కాని ఆ తరువాతి రోజు నా సమయస్ఫూర్తిని పక్కింటివాళ్ళకి చెబుతూ మా వాడు భలే తెలివైనవాడని చెబుతుంటే నేను పక్కగా విని....భలే గర్వంగా ఫీల్ అయ్యా..ఏదో మంత్రి పదవికి ఏక్రీగవంగా ఎన్నికయినట్టు !!
చిన్నప్పుడు జరిగిన కొన్ని సరదా సన్నివేసాలు, మరిచిపొలేని అనుభవాలను ... గుర్తుంచొకొవాల్సిన అనుభూతులను...ఈ చల్లని సాయంత్రం మీతో పంచుకోవాలని...
నేను పుట్టినప్పుడు(1986, April 27) నన్ను చూడడానికి మా చుట్టాల్లు ఇంటికి వచ్చారట. అందులొ ఒకాయన మా అక్కని చూసి...మీ తమ్ముడు కూడా నీలాగా తెల్లగా ఉంటాడా అని అడిగారట. మా అక్క ఔను అన్నదట. ఆ తరువాత ఆయన నన్ను చూసి.. మా అక్క దగ్గరికి వెళ్ళి ..ఎందుకు అబద్దం చెప్పావ్? అన్నారట ఆయన. అప్పుడు మా అక్క "అంకుల్, మా తమ్ముడు పొద్దున్న తెల్లగానే ఉంటాడు...సాయంత్రం అయ్యేసరికి ఇలా వాడిపోతాడు అందట...అందరూ నవ్వాపలేక చచ్చారట!! అప్పుడు మా అక్కకు 4 సంవత్సరాలు. (మా అక్క భావం ఏంటంటే, పొద్దున్న చక్కగా స్నానం చేయించి పౌడర్ రాస్తే కాస్త తెల్లగా కనిపిస్తారుగా...సాయంత్రానికి అందరూ బాగా ఎత్తుకుని ముద్దులాడేసి మాపేస్తారు గా !! అసలు రూపం బయటపడుతుందిగా...అదేమొ ఒక వేళ..మా అక్కకీ గుర్తులేదట తను ఏమనుకుని అలా అందో.!!)